అసెంబ్లీ ఎన్నికలపై కేసులే కేసులు...

January 26, 2019


img

అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ, కౌంటింగ్, ఫలితాలపై రోజుకో కొత్త కేసు దాఖలావుతూనే ఉంది. సిద్దిపేట జిల్లాలోని మామిడాల  గ్రామానికి చెందిన తమ్మాల శ్రీనివాస్‌ ఏకంగా సిఎం కేసీఆర్‌ ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేశారు. సిఎం కేసీఆర్‌ ఎన్నికల సంఘానికి సమర్పించిన నామినేషన్ పత్రాలతో పాటు సమర్పించిన అఫిడవిట్ లో తనకు సంబందించి కొన్ని వివరాలను చెప్పకుండా దాచిపెట్టారని, ఆవిధంగా చేయడం ప్రజాప్రాతినిధ్య చట్టం-1951, ఎన్నికల నిబంధనలు-1961లకు విరుద్దమని  తన పిటిషనులో పేర్కొన్నారు. సిఎం కేసీఆర్‌పై అనేకచోట్ల పోలీస్ కేసులు నమోదై ఉన్నప్పుడూ ఆయన వాటి గురించి పేర్కొనకుండా నామినేషన్ ఫారంలో ‘కేసు స్వభావం’ అనే కాలం ఎదురుగా ‘నాట్ నోన్’ అని మాత్రమే వ్రాసి, తన కేసుల వివరాలు చెప్పకుండా ఉద్దేశ్యపూర్వకంగా దాచిపెట్టారని, ఎన్నికల సమయంలో ఇతర పార్టీల గ ఏజంట్లను బెదిరించి భయపెట్టారని శ్రీనివాస్ తన పిటిషనులో ఫిర్యాదు చేశారు. ఎన్నికల నియమావళికి విరుద్దంగా వ్యవహరించినందుకు సిఎం కేసీఆర్‌ ఎన్నికను రద్దు చేయాలని శ్రీనివాస్ న్యాయస్థానాన్ని కోరారు.     

ఇదిగాక మంచిర్యాల నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయిన కాంగ్రెస్‌ అభ్యర్ధి కె.ప్రేంసాగర్ రావు కూడా హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు. తెరాస అభ్యర్ధి ఎన్.దివాకర్ రావు ఎన్నికల అధికారులను, కౌంటింగ్ అధికారులను ప్రలోభపెట్టి ఫలితాలను తారుమారు చేశారని ఆరోపించారు. పోలింగ్ ముగిసిన వెంటనే ఈవీఎంలను, వివి ప్యాట్  మెషిన్లను స్ట్రాంగ్ రూమ్ కు తరలించకుండా రాత్రిపూట రహస్యంగా బస్సులలో వేరే చోటికి తీసుకువెళ్ళారని ఆరోపించారు. పోలింగ్ పూర్తయిన రోజున సాయంత్రం 5గంటలకు 61.8శాతం పోలింగ్ జరిగిందని ప్రకటించిన అధికారులు మరుసటిరోజున ఉద్యామ్ 71.74 శాతం పోలింగ్ జరిగిందని చెప్పడం గమనిస్తే ఈవీఎంలను, వివిప్యాట్ మెషిన్లను రిగ్గింగ్ చేసినట్లు స్పష్టం అవుతోందని ప్రేంసాగర్ రావు ఆరోపించారు. కనుక ఎన్‌.దివాకర్‌రావు ఎన్నికను రద్దు చేసి మంచిర్యాల నియోజకవర్గంలో జరిగిన అవకతవకలపై తక్షణమే విచారణ జరిపించాలని ప్రేంసాగర్ రావు న్యాయస్థానాన్ని కోరారు. ఈరెండు పిటిషన్లపై సోమవారం విచారణ జరిగే అవకాశం ఉంది. ఇవి కాక కాంగ్రెస్‌ నేతలు డికె అరుణ, రేవంత్‌ రెడ్డి, దాసోజు శ్రావణ్ కుమార్, మల్ రెడ్డి రంగారెడ్డి కూడా హైకోర్టులో పిటిషన్లు వేశారు. వాటిపై కూడా త్వరలో విచారణ జరుగనుంది. ఈ పిటిషన్లపై హైకోర్టు ఏవిధంగా స్పందిస్తుందో తెలియదు కానీ విచారణకు ఆదేశిస్తే తెరాస ప్రభుత్వానికి, గెలిచిన అభ్యర్ధులకు, రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఇబ్బందికర పరిస్థితులు తప్పకపోవచ్చు.


Related Post