పంచాయతీ ఎన్నికలు ముగియగానే మండలి ఎన్నికలు

January 25, 2019


img

రాష్ట్ర శాసనసభ ముందస్తు ఎన్నికలతో రాష్ట్రంలో మొదలైన ఎన్నికల హడావుడి, వేడి మార్చి-ఏప్రిల్ నెలల్లో లోక్‌సభ ఎన్నికలు ముగిసేవరకు కొనసాగుతూనే ఉంటుంది. ఇవాళ్ళ రెండవ విడత పంచాయతీ ఎన్నికలకు పోలింగ్ పూర్తయింది. ఈనెల30న మూడవ విడత పోలింగ్ తో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది. అవి పూర్తికాగానే రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల నగరా మోగుతుంది. 

వాటిలో స్థానిక సంస్థల కోటా, ఎమ్మెల్యేల కోటా, ఉపాద్యాయులు, పట్టభద్రుల నియోజకవర్గాలలో మొత్తం 15మంది ఎమ్మెల్సీల ఎన్నిక జరుగుతుంది. వీరుకాక గవర్నర్ కోటాలో ఒక ఎమ్మెల్సీ నియామకం జరుగుతుంది. పట్టభద్రుల నియోజకవర్గాలలో ఎమ్మెల్సీల ఎన్నికల కోసం మెదక్‌-నిజామాబాద్‌-ఆదిలాబాద్‌-కరీంనగర్‌, వరంగల్‌-ఖమ్మం-నల్గొండ జిల్లాలలో అధికారులు ఓటర్ల జాబితాలను సిద్ధం చేస్తున్నారు. 

ఎమ్మెల్యే కోటాలో ఎన్నికైన పట్నం నరేందర్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మైనంపల్లి హనుమంతరావు ముగ్గురూ ఇటీవల అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసి ఎమ్మెల్యేలుగా ఎన్నికవడంతో వారు తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామాలు చేశారు. ఎమ్మెల్యేల కోటాలో ఎన్నికైన షబ్బీర్‌ అలీ, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, టి.సంతోష్‌కుమార్‌, మహ్మద్‌ సలీం, మహమూద్‌ ఆలీ, కె.యాదవరెడ్డి పదవీ కాలం మార్చిలోనే ముగుస్తుంది. వారిలో యాదవరెడ్డి పదవీకాలం ముగియక మునుపే ఆయనపై అనర్హత వేటుపడటంతో ఆ స్థానం ఖాళీ అయ్యింది. కనుక ఎమ్మెల్యేల కోటాలో మొత్తం 9 స్థానాలకు ఎన్నికలు నిర్వహించవలసి ఉంది. 

స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన కొండామురళి అనర్హత వేటు తప్పించుకోవడానికి ఇటీవలే తన పదవికి రాజీనామా చేయడంతో ఆ స్థానం ఖాళీ అయ్యింది. స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీలుగా ఉన్న ఎంఎస్ ప్రభాకర్, భూపతిరెడ్డిల పదవీ కాలం మార్చితో ముగుస్తుంది. భూపతిరెడ్డిపై అనర్హత వేటు పడినందున పదవీకాలం పూర్తికాకముందే ఆ స్థానం ఖాళీ అయ్యింది. కనుక ఈ కోటాలో మొత్తం 3 స్థానాలకు ఎన్నికలు నిర్వహించవలసి ఉంది. 

గవర్నర్ కోటాలో నియమితుడైన సభవత్ రాములు నాయక్‌పై అనర్హతవేటు పడటంతో ఆ స్థానం ఖాళీ అయ్యింది. దానిని ప్రభుత్వం సూచించిన వ్యక్తితో గవర్నర్ నరసింహన్ భర్తీ చేస్తారు.   

కనుక ఎమ్మెల్యే కోటాలో 9, స్థానిక సంస్థల కోటాలో 3, ఉపాధ్యాయుల పట్టభద్రుల నియోజకవర్గాలలో 2 స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. 

ఫిబ్రవరి 20వ తేదీన తుది ఓటర్ల జాబితాను ప్రకటించి, వెంటనే ఎన్నికలకు నోటిఫికేషన్‌ జారీ చేయాలని అధికారులు భావిస్తున్నారు. కనుక వచ్చే నెలంతా ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడి ఉంటుంది. అవి పూర్తయ్యే సరికి లోక్‌సభ ఎన్నికలకు గంట మోగవచ్చు. 


Related Post