మెదక్‌ నుంచి రాహుల్ లేదా ప్రియాంక పోటీ?

January 25, 2019


img

ప్రియాంకా వాద్రాను ఏఐసిసి ప్రధానకార్యదర్శిగా నియమించడాన్ని సంగారెడ్డి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్వాగతించారు. ఆయన గురువారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రియాంకను ప్రత్యక్ష రాజకీయాలలోకి తీసుకువచ్చి పార్టీలో కీలక భాద్యతలు అప్పగించి చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. అచ్చం స్వర్గీయ ఇందిరాగాంధీ పోలికలున్న ప్రియాంక సరైన సమయంలో ప్రత్యక్ష రాజకీయాలలోకి ప్రవేశించడం చేత దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ కార్యకర్తలు చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఆమె యావత్ దేశంపై ప్రభావం చూపుతారని భావిస్తున్నాను. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్ గాంధీ లేదా ప్రియాంకా గానీ మెదక్‌ నుంచి పోటీ చేయాలని కోరుతున్నాను. వారు మెదక్‌ నుంచి పోటీ చేసినట్లయితే భారీ మెజార్టీతో గెలిపించుకొంటాము. మల్లు భట్టివిక్రమార్కకు పార్టీలో అందరూ మద్దతు, పూర్తిసహకారం అందించాలి. ఆయనను వ్యతిరేకించడమంటే రాహుల్ గాంధీ నిర్ణయాన్ని వ్యతిరేకించినట్లేనని గ్రహించాలి,” అని అన్నారు.

కాంగ్రెస్ పార్టీకి చాలా కీలకమైన లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రియాంకా వాద్రాను ప్రత్యక్ష రాజకీయాలలోకి తీసుకురావడం వ్యూహాత్మకంగా మంచి నిర్ణయమే కానీ ఆమె స్వర్గీయ ఇందిరాగాంధీ పోలి ఉన్నంత మాత్రన్న ఓట్లు రాలిపోవు. మహానాయకుల పోలికలుంటే ప్రజలు ఆదరించి అధికారం కట్టబెడతారనుకుంటే స్వర్గీయ ఎన్టీఆర్, నరేంద్రమోడీవంటి వారి పోలికులున్న వారున్నారు. వారు కూడా అధికారంలోకి వచ్చి ఉండేవారు కదా?

నాయకత్వ లక్షణాలు, మంచి వాగ్ధాటి, రాజకీయ చతురత, అంగబలం, అర్ధబలం వంటివన్నీ ఉన్నప్పుడే ఎవరైనా విజయం సాధిస్తారు. పార్టీలను గెలిపించగలరు. ప్రియాంకా వాద్రాకు అంగబలం, అర్ధబలం రెండూ ఉన్నాయి కానీ నాయకత్వ లక్షణాలు, రాజకీయ చతురత ఉన్నాయో లేవో త్వరలో జరుగబోయే లోక్‌సభ ఎన్నికలలో తేలిపోతుంది.


Related Post