కాంగ్రెస్‌ నేతలు హైకోర్టులో పిటిషన్

January 24, 2019


img

అసెంబ్లీ ఎన్నికలలో రాష్ట్ర ఎన్నికల సంఘం చాలా నిర్లక్ష్యంగా, పక్షపాత ధోరణితో వ్యవహరించినందుకు నీరసనగా కాంగ్రెస్‌ నేతలు ఈరోజు ధర్నా చౌక్ వద్ద ధర్నా చేసిన తరువాత దాసోజు శ్రవణ్‌, రేవంత్ రెడ్డి, డికె.అరుణ హైకోర్టులో ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా పిటిషన్లు వేశారు.

ఎన్నికల నియామవళికి విరుద్దంగా ఓటర్లను ప్రలోభాలకు గురి చేసి గెలిచిన తెరాస ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అనర్హుడిగా ప్రకటించాలని రేవంత్‌ రెడ్డి పిటిషన్ వేశారు. ఎన్నికలలో పోలైన ఓట్ల కంటే కౌంటింగులో ఎక్కువ ఓట్లు వచ్చాయని, అది ఎన్నికల నియామావళికి వ్యతిరేకమని ఎన్నికల సంఘం ప్రధానాధికారి రజత్ కుమార్ దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ ఆయన స్పందించలేదని డికె అరుణ పిటిషన్‌లో పేర్కొన్నారు.ఓటర్ల జాబితా రూపొందించడం మొదలు కౌంటింగ్ వరకు అన్ని దశలలోనూ ఎన్నికల సంఘం తీవ్ర నిర్లక్ష్యం, పక్షపాతధోరణి ప్రదర్శించిందని వారు పిటిషన్‌లో పేర్కొన్నారు.

ఇబ్రహీంపట్నం నుంచి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయిన మల్ రెడ్డి రంగారెడ్డి కూడా ఎన్నికల సంఘంపై హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు. దానిపై ఈనెల 30వతేదీలోగా వివరణ ఇవ్వాలని హైకోర్టు ఎన్నికల సంఘానికి నోటీస్ పంపింది. ఎన్నికలలో అభ్యర్ధులు అవకతవకలకు పాల్పడ్డారంటూ కోర్టులలో కేసులు దాఖలవడం సాధారణమైన విషయమే కానీ ఎన్నికల సంఘమే అవకతవకలకు పాల్పడిందంటూ హైకోర్టులో కేసులు దాఖలవుతుండటం విశేషమే.


Related Post