ఆమెను దించినా ప్రయోజనం ఉండదేమో?

January 24, 2019


img

ఈసారి లోక్‌సభ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి జీవన్మరణ సమస్య వంటివి కనుక ప్రియాంకా వాద్రాను రంగంలోకి దింపి, ఆమెకు తూర్పు యూపీ బాధ్యతలు అప్పగించారు రాహుల్ గాంధీ. ఆమెను కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాస్త్రంగా అభివర్ణిస్తోంది. ఆమె దెబ్బకు ఈసారి మోడీ, బిజెపి ఓడిపోకతప్పదనే నమ్మకంతో ఉంది. అయితే ప్రియాంకా వాద్రాకు ఎటువంటి రాజకీయ అనుభవం లేదని, ఆమె శక్తి సామర్ధ్యాల గురించి ప్రజలకు కూడా పెద్దగా తెలియదని కనుక ఆమె బిజెపికి, ప్రధాని నరేంద్రమోడీకి పోటీకాజాలరని ఎన్నికల వ్యూహ నిపుణుడు, జేడీయూ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆమెకు కనీసం రెండు మూడేళ్ళ సమయం ఇస్తే ఆమె గురించి ప్రజలు ఒక అంచనాకు వస్తారని, అప్పుడే ఆమె శక్తిసమార్ధ్యాలను పరీక్షించుకోవచ్చునని అన్నారు. అయితే ఆమె ప్రత్యక్షరాజకీయాలలో ప్రవేశించడం తప్పకుండా సంచలనమేనని ప్రశాంత్ కిషోర్ అన్నారు.

ఆయన అభిప్రాయాన్నే మరోరకంగా చెప్పుకొన్నట్లయితే, మూడేళ్ళ క్రితమే కాంగ్రెస్ పార్టీ ప్రియాంకా వాద్రాను ప్రత్యక్షరాజకీయాలలోకి రప్పించి ఉండి ఉంటే, త్వరలో జరుగబోయే లోక్‌సభ ఎన్నికలలో ఆమె ఆశించిన ఫలితాలు సాధించగలరో లేదనే విషయం ఈపాటికే స్పష్టమయ్యుండేది. కానీ కాంగ్రెస్ పార్టీ చివరి నిమిషంలో ఆమెను రంగంలో దించడం వలన ప్రజలు ఆమెను అంచనా వేయడం కష్టమే…ఆమె తనకున్న చరిస్మాతో ప్రజలను ప్రభావితం చేయడం కూడా కష్టమే. ప్రజలను ఆకర్షించడమే కాకుండా బలమైన తమ రాజకీయ ప్రత్యర్ధులను కూడా ధీటుగా ఎదుర్కొని ఆమె పార్టీకి విజయం సాధించిపెట్టవలసి ఉంటుంది. అది కూడా కష్టమే. మహా అయితే ఆమె కాంగ్రెస్ పార్టీకి అధనంగా కొన్ని సీట్లు గెలిచిపెట్టగలరేమో కానీ ఒంటి చేత్తో కాంగ్రెస్ పార్టీని కేంద్రంలో అధికారంలోకి తీసుకురాలేరని చెప్పవచ్చు.


Related Post