తూచ్..మమత కాదు రాహుల్ గాంధీయే ప్రధాని!

January 24, 2019


img

త్వరలో జరుగబోయే లోక్‌సభ ఎన్నికలలో బిజెపితో కాంగ్రెస్‌ నేతృత్వంలో ఒక ఫ్రంట్, సిఎం కేసీఆర్‌ ప్రతిపాదిస్తున్న మరో  ఫ్రంట్ పోటీ పడబోతున్నట్లు కనిపిస్తోంది. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధానమంత్రి కావాలని కలలు కంటున్నారు కనుక రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్ధిగా భావిస్తున్న కాంగ్రెస్‌ నేతృత్వంలో పనిచేసేందుకు ఆమె అంగీకరించకపోవచ్చు. 

కేసీఆర్‌ ఫ్రంటులో ఏఏ పార్టీలు ఉంటాయో ఇంకా తెలియదు కనుక ఆమె దానిలో చేరుతారో లేదో కూడా తెలియదు. ఒకవేళ దానిలో చేరాలనుకుంటే ఆమె నాయకత్వాన్ని కేసీఆర్‌ అంగీకరించాలి లేదా కేసీఆర్‌ నాయకత్వాన్ని ఆమె అయినా అంగీకరించాలి. ఆ రెండూ అసాధ్యంగానే కనిపిస్తున్నాయి కనుక మమతా బెనర్జీ తన ప్రయత్నాలు తాను చేసుకొంటున్నట్లున్నారు. 

ఆ ప్రయత్నంలోనే ఇటీవల కోల్‌కతాలో యునైటెడ్ ఇండియా బ్రిగేడ్ పేరిట భారీ ర్యాలీ నిర్వహించారు. ఆ ర్యాలీకి 23 పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు. అయితే వారందరూ మమతా బెనర్జీ నాయకత్వాన్ని అంగీకరించారని కాదు. ఆమెకు కేవలం సంఘీభావం తెలిపేందుకే హాజరయ్యారని చెప్పవచ్చు. కానీ ఆ ర్యాలీకి హాజరైన కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి మాట్లాడుతూ “మమతా బెనర్జీ గొప్ప నాయకత్వ లక్షణాలున్న నేత. దేశాన్ని కూడా నడిపించగల సమర్ధురాలు,” అని అన్నారు. అంటే ప్రధాని అభ్యర్ధిగా ఆమెను అంగీకరిస్తున్నట్లు చెప్పినట్లు భావించవచ్చు. 

కానీ మళ్ళీ ఇవాళ్ళ దానికి చిన్న సవరణ ప్రకటన విడుదల చేశారు. “మమతా బెనర్జీ, మాయావతీ ఇద్దరూ గొప్ప నాయకురాళ్ళే. వారు కూడా ప్రధాని పదవికి పోటీ పడవచ్చు. కానీ మా జెడిఎస్ పార్టీ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని కోరుకొంటోంది. ఆయనకే మా పార్టీ మద్దతు ఇస్తుంది,” అని చెప్పారు. అంటే మమతా బెనర్జీకి జెడిఎస్ మద్దతు లభించదని స్పష్టం అయ్యింది. అలాగే కేసీఆర్‌ ఫ్రాంటులో జెడిఎస్ చేరబోదని స్పష్టం అయ్యింది. 


Related Post