కాంగ్రెస్‌-బిజెపిల మద్య అదే తేడా: మోడీ

January 23, 2019


img

కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన సోదరి ప్రియాంకా వాద్రను ఏఐసిసి ప్రధాన కార్యదర్శిగా నియమించి, త్వరలో జరుగబోయే లోక్‌సభ ఎన్నికలలో తూర్పు ఉత్తరప్రదేశ్ లోని పార్టీ బాధ్యతలను అప్పగించడంపై ప్రధాని నరేంద్రమోడీ తనదైన శైలిలో స్పందించారు. 

డిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మహారాష్ట్ర బిజెపి కార్యకర్తలతో మాట్లాడుతూ, “మనందరికీ పార్టీయే కుటుంబం కానీ కుటుంబమే కాంగ్రెస్ పార్టీ. మనం కుటుంబాల ప్రాతిపదికన నిర్ణయాలు తీసుకోము. వ్యక్తిగత ఆలోచనలు, అభిప్రాయాలకు మన పార్టీలో తావులేదు. పార్టీ, ప్రభుత్వం, ప్రజలు ప్రాతిపదికన మాత్రమే నిర్ణయాలు తీసుకొంటుంటాము. కానీ కాంగ్రెస్ పార్టీలో కుటుంబమే ప్రాతిపదికన నిర్ణయాలు జరుగుతుంటాయి. ఇదే బిజెపికి కాంగ్రెస్ పార్టీకి ఉన్న ప్రధానమైన తేడా,” అని చెప్పారు. 

ఈవిషయంలో ప్రధాని నరేంద్రమోడీ చెప్పిన మాట నూటికి నూరుపాళ్లు నిజమేనని అందరికీ తెలుసు. కాంగ్రెస్ పార్టీలో సోనియా, రాహుల్, ప్రియాంకాలకు అతీతంగా ఎవరూ ఆలోచించలేరు. వారు కాక మరెవరికీ పార్టీలో ప్రాధాన్యత ఉండదు. ఒకవేళ ఎప్పుడైనా నెహ్రూ కుటుంబానికి చెందనివారు పార్టీలో, ప్రభుత్వంలో కీలకబాధ్యతలు చేపట్టే అవకాశం కలిగినా అది తాత్కాలికమే అవుతుంది లేదా వారు సోనియా, రాహుల్ నియంత్రణలో పనిచేసేవారై ఉంటారు. 

దేశంలో బిజెపి, వామపక్షాలు తప్ప దాదాపు అన్ని పార్టీలలో కుటుంబపాలన సాగుతూనే ఉంది. కనుక ఇంచుమించు అన్ని పార్టీలలో ఇదే పరిస్థితులు కనిపిస్తాయి. నిజం చెప్పుకోవాలంటే దేశంలో ప్రాంతీయ పార్టీలన్నీ మళ్ళీ మెల్లగా రాచరికవ్యవస్థను తీసుకువచ్చేందుకు గట్టిగానే ప్రయత్నిస్తున్నాయి. ఎన్నికలలో తమకు ఎవరూ పోటీ ఉండకూడదు. మా మాటే శాసనం. ఎన్నికలు..చట్టాలు..రాజ్యాంగం...అన్నీ మిద్య..ఎల్లప్పటికీ మేమే అధికారంలో ఉండాలి...మా ఆలోచనలు, నిర్ణయాలే సరైనవి. వాటిని ఎవరూ ప్రశ్నించకూడదు. మేము చేసేదే అత్యద్భుతమైన పాలన...అన్నట్లు సాగిపోతున్నాయి. బిజెపిలో వంశపారంపర్య పాలన లేదనే మాటే కానీ ఈ విషయంలో మోడీ సర్కారు కూడా అతీతం కాదు. అందుకే ప్రతిపక్షాలు చేతులు కలుపుతున్నాయి. అయితే ఇటువంటి వైఖరి ప్రదర్శిస్తున్నప్పటికీ రాజకీయ చతురత, చేతిలో అధికారం, ప్రజాధారణ ఉన్నంతకాలం అన్నీ ఆమోదయోగ్యంగానే కనిపిస్తుంటాయి.


Related Post