ఎవరు ప్రకటించేరనేది కాదు...ఎవరు ఓన్ చేసుకున్నారనేదే ముఖ్యం!

January 23, 2019


img

చంద్రబాబు తమ పధకాలను కాపీ కొడుతున్నారని తెరాస...మా నవరత్నాలను ఎత్తుకుపోతున్నారని వైకాపా ఆరోపిస్తున్నాయి. 

ఈసారి జరుగబోయే శాసనసభ ఎన్నికలలో ఎలాగైనా గెలిచి ఏపీ ముఖ్యమంత్రి కావాలనే ఉద్దేశ్యంతో వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి సుమారు 12 నెలల పాటు ఏపీలో కాళ్ళరిగిపోయేలా పాదయాత్ర చేశారు. ఆ సందర్భంగా తమ పార్టీ అధికారంలోకి వస్తే ఏమేమీ సంక్షేమపధకాలు అమలుచేస్తుందో ప్రకటించారు. ఆయన ప్రకటించిన తొమ్మిది హామీలకు నవరత్నాలని పేరు పెట్టారు. అయితే సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతుండటంతో చంద్రబాబునాయుడు కూడా వరుసగా కొత్తకొత్త సంక్షేమపధకాలు ప్రారంభిస్తున్నారు. అవి జగన్ ప్రకటించిన నవరత్నాలను పోలి ఉండటంతో చంద్రబాబునాయుడు తన నవరత్నాలను ఎత్తుకుపోతున్నాడని జగన్మోహన్ రెడ్డి, వైకాపా నేతలు ఆరోపిస్తున్నారు. 

మరోవైపు తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ కూడా ఇంచుమించు అటువంటి ఆరోపణలే చేశారు. తమ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పధకాలను, వివిద రంగాల అభివృద్ధికి రూపొందించిన పాలసీలను చంద్రబాబునాయుడు ప్రభుత్వం కాపీ కొడుతోందని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వ పధకాలనే ఏపీ సర్కారు కాపీ పేస్ట్ చేస్తోందని కేటీఆర్‌ ఈరోజు ఆరోపించారు. అయితే చిత్తశుద్ధిలేనప్పుడు ఎన్ని పధకాలు కాపీ కొట్టినా ప్రయోజనం ఉండదని, ప్రజలు చంద్రబాబును నమ్మబోరని అన్నారు. 

అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన నిరుద్యోగభృతి, పెన్షన్ రెట్టింపు చేయడంవంటి హామీలను తెరాస కాపీకొట్టిన సంగతి అందరికీ తెలుసు. అప్పుడు తెరాసనుద్దేశ్యించి కాంగ్రెస్‌ నేతలు కూడా ఇలాగే ఆరోపించారు. కానీ ఎవరేమనుకున్నా ఆ పధకాలపట్ల ప్రజలకు నమ్మకం కలిగించి, అవకాశం ఉంటే వాటిని సక్రమంగా అమలుచేయగలిగిన పార్టీకే అంతిమంగా క్రెడిట్, రాజకీయ లబ్ది లభిస్తాయని తెలంగాణ ఎన్నికలలో నిరూపితమైంది కనుక చంద్రబాబునాయుడు కూడా అదే రూల్ ఫాలో అయిపోతున్నట్లున్నారు. కనుక పధకాల గురించి ఎవరు ఎన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసినా అది కంఠశోషే అవుతుంది. ఎవరు ప్రకటించేరనేది కాదు...ఎవరు ఓన్ చేసుకున్నారనేదే ముఖ్యం!  అయినా తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పధకాలను ఆదర్శంగా తీసుకొని దేశంలో వివిద రాష్ట్రాలు కూడా అమలుచేస్తున్నాయని గర్వంగా చెప్పుకొనే తెరాస, తమ పధకాలను చంద్రబాబునాయుడు కాపీ కొడుతుంటే సంతోషించాలి కానీ విమర్శించడం ఎందుకు? 



Related Post