కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం

January 23, 2019


img

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్నందున కాంగ్రెస్ పార్టీ ఈరోజు కీలక నిర్ణయం తీసుకొంది. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సోదరి ప్రియాంకా వాద్రాను కాంగ్రెస్ పార్టీ ప్రధానకార్యదర్శిగా నియమిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఉత్తరప్రదేశ్ (తూర్పు) బాధ్యతలను కూడా ఆమెకు కట్టబెట్టారు. ఫిబ్రవరి మొదటివారంలో ఆమె ఈ బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. సోనియాగాంధీ తరచూ ఆరోగ్యసమస్యలతో బాధపడుతున్నందున ఈసారి లోక్‌సభ ఎన్నికలలో ఆమె పోటీ చేయకపోవచ్చునని కనుక ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న రాయ్ బరేలీ నుంచి ఈసారి ప్రియాంకా వాద్రాను లోక్‌సభకు పోటీ చేయించేందుకే రాహుల్ గాంధీ ఈ నిర్ణయం తీసుకున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 

ఆమెకు పార్టీ బాధ్యతలు అప్పగించడానికి మరికొన్ని బలమైన కారణాలు కనిపిస్తున్నాయి. ఈసారి లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలవకపోతే రాహుల్ గాంధీ మరో ఐదేళ్ళపాటు ప్రధాని నరేంద్రమోడీని విమర్శిస్తూ కాలక్షేపం చేయవలసి ఉంటుంది. అప్పటికి మోడీ నాయకత్వంలో బిజెపి మరింత బలపడితే కాంగ్రెస్ పార్టీ ఇక ఎన్నటికీ కేంద్రంలో అధికారంలోకి రాలేదు...రాహుల్ గాంధీ ఎన్నటికీ ప్రధానమంత్రి కాలేరు. కనుక ఈసారి జరుగబోయే ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యంగా రాహుల్ గాంధీ రాజకీయ భవిష్యత్ కు చాలా కీలకమైనవి. 

ఈ ఎన్నికలలో గెలిచితీరాలంటే ముందుగా 80 లోక్‌సభ స్థానాలున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మెజార్టీ సీట్లు గెలుచుకోవలసి ఉంటుంది. కానీ ఆ రాష్ట్రంలో ఇప్పటివరకు అధికారం చెలాయించిన సమాజ్‌వాదీ పార్టీ, బహుజన్ సమాజ్‌వాదీ పార్టీలు రెండూ చేతులు కలిపి కాంగ్రెస్ పార్టీని దూరంగా పెట్టాయి. కనుక కాంగ్రెస్ పార్టీ ఒంటరిపోరాటం చేయకతప్పదు. అయితే యూపీలో ఆ రెండు పార్టీలను, అధికారంలో ఉన్న బిజెపిని ఎదుర్కోవాలంటే కాంగ్రెస్ పార్టీకి శక్తికి మించినపనే. స్వర్గీయ ఇందిరాగాంధీ పోలికలున్న కారణంగా ప్రియాంకా వాద్రాకు యూపీలో మంచి ప్రజాధారణ ఉంది. ఆమె ప్రత్యక్ష రాజకీయాలలోకి రావాలని చాలాకాలంగా కాంగ్రెస్‌ నేతలు కోరుతున్నారు. కనుకనే ఆమెకు పార్టీ బాధ్యతలు అప్పగించారు. ఆమెకు పార్టీ బాధ్యతలు అప్పగించడం మంచి నిర్ణయమేనని చెప్పవచ్చు. కానీ ఆమె యూపీలో రాజకీయ సవాళ్లను ఎదుర్కొని కాంగ్రెస్ పార్టీని గెలిపించగలరో లేదో చూడాలి. 


Related Post