పంటరుణాల మాఫీపై రఘురామ రాజన్ వ్యాఖ్యలు

January 23, 2019


img

ఒకప్పుడు ఎన్నికలలో ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన పార్టీలు అమలుచేసేవికావు కనుక ఎన్ని హామీలు ఇచ్చినా తేడా ఉండేది కాదు. కానీ ప్రజలలో రాజకీయ చైతన్యం పెరగడం, ప్రతిపక్షాల, మీడియా ఒత్తిడి కూడా పెరగడంతో ఎన్నికల హామీలను అమలుచేయక తప్పనిసరి పరిస్థితులు నెలకొన్నాయి. 

కానీ నేటికీ అన్ని పార్టీలు ఏదోవిధంగా అధికారం చేజిక్కించుకోవాలనే తాపత్రయంతో ఆచరణసాధ్యం కానీ హామీలను గుప్పిస్తూనే ఉన్నాయి. ఆ తరువాత వాటిని అమలుచేయలేక ఆపసోపాలు పడుతూనే ఉన్నాయి. పంట రుణాలమాఫీ      వాటిలో ఒకటి. మొదట్లో దీనిని అందరూ తప్పు పట్టినప్పటికీ ఇప్పుడు దేశంలో అనేక రాష్ట్రాలలో పంటరుణాల మాఫీ విషయంలో రాజకీయ పార్టీలు పోటీపడుతూ హామీలు గుప్పిస్తున్నాయి. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్‌ పార్టీ తాము అధికారంలోకి వస్తే ఒకేసారి రూ.2 లక్షలు పంట రుణాలమాఫీ చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. 

అయితే రైతుల సంక్షేమం కోసమో లేక వ్యవసాయాభివృద్ధి కోసమో కాక కేవలం అధికారం చేజిక్కించుకోవడం కోసమే రాజకీయ పార్టీలు పంటరుణాల మాఫీ చేయాలనుకోవడం వలన ఆ భారం మళ్ళీ ప్రజలపైనే పడుతుంది. 

ప్రస్తుతం దావోస్ లో జరుగుతున్న వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సమావేశాలలో పాల్గొన్న రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ రాజన్ అక్కడ మీడియాకు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికరమైన విషయాలు మాట్లాడారు. 

“రైతులందరికీ పంటరుణాల మాఫీ చేయడంవలన ప్రయోజనం లేకపోగా ప్రభుత్వంపై, ప్రజలపై అధనపు భారం మోపినట్లవుతుంది. కనుక బొత్తిగా చెల్లింపు సామర్ధ్యం లేని రైతులకు మాత్రమే దీనిని వర్తింపజేస్తే మంచిది. ఈరోజుల్లో చాలా సేవలు ఉచితంగా లభిస్తున్నాయి. కానీ ఈ ప్రపంచంలో ఏదీ ఉచితంగా లభించదనే సంగతి అందరికీ తెలుసు. అంటే ఉచితంగా పొందుతున్న వస్తువులు లేదా సేవలకు వేరే రూపంలో ఎక్కడో వసూళ్లు, చెల్లింపులు జరుగుతున్నాయని గ్రహించాలి. కనుక ఉచితాలను వదిలించుకోవడమే మంచిదని భావిస్తున్నాను. 

మాజీ ప్రధాని స్వర్గీయ నర్సింహరావు, మాజీ ఆర్ధికమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ అనుసరించిన ఆర్ధిక విధానాలు, సంస్కరణలే నేటికీ ఆదర్శంగా నిలుస్తున్నాయి. కనుక పాలకులు వాటిని మార్గదర్శకాలుగా తీసుకొని ముందుకుసాగితే మంచిది. రిజర్వ్ బ్యాంక్ గవర్నరు కేంద్రప్రభుత్వం కార్యదర్శి ఆదేశానుసారం పనిచేయవలసి రావడం కూడా సరికాదని నా అభిప్రాయం. ఆర్ధికమంత్రి తరువాత స్థానంలో రిజర్వ్ బ్యాంక్ గవర్నరు హోదా ఉండాలని నేను భావిస్తున్నాను. మోడీ ప్రభుత్వం జిఎస్టి చట్టాన్ని చక్కగా అమలుచేస్తోంది. దాని వలన ప్రస్తుతం కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవలసివస్తున్నా దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉంటాయని నేను భావిస్తున్నాను,” అని అన్నారు రఘురామ రాజన్.       

భారతదేశం ప్రధానంగా వినియోగ ఆధారితదేశం కనుక ఉద్యోగాల కల్పనకు అదే ఒక పెద్ద వరం వంటిది. కనుక ప్రభుత్వాలు తదనుగుణంగా ప్రణాళికలు రచించుకొని పెట్టుబడులు, వినియోగం సమాన నిష్పత్తిలో పెరిగేలా చర్యలు తీసుకోవాలి. ప్రస్తుతం దేశంలో వ్యవసాయ, ఉద్యోగ, ఉపాది రంగాల పరిస్థితి ఏమీ బాగోలేదు. లోక్‌సభ ఎన్నికలలో ఇవే ప్రధానఅజెండాగా మారే అవకాశం ఉందని నేను భావిస్తున్నాను,” అని అన్నారు రఘురామ రాజన్. 


Related Post