ఫిబ్రవరిలో తాత్కాలిక రాష్ట్ర బడ్జెట్?

January 23, 2019


img

ఈసారి లోక్‌సభ ఎన్నికల తరువాతే పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాలని కేంద్రప్రభుత్వం భావిస్తోంది కనుక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్పుడే పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రాలకు నిధులు కేటాయిస్తుంటుంది కనుక కేంద్రం నుంచి రాష్ట్రానికి ఎంత మొత్తం వస్తుందో తెలుసుకున్నాక దానిని బట్టి పూర్తిస్థాయి రాష్ట్ర బడ్జెట్ రూపొందించుకోవాలని సిఎం కేసీఆర్‌ భావిస్తున్నారు. కనుక కేంద్రబడ్జెట్ తరువాతే రాష్ట్రంలో కూడా పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాలనుకొంటున్నట్లు సిఎం కేసీఆర్‌ ఇటీవల స్వయంగా శాసనసభలో తెలియజేశారు. 

కనుక అప్పటి వరకు ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, ప్రభుత్వ నిర్వహణకు రోజువారీ ఖర్చుల నిమిత్తం తాత్కాలికంగా మధ్యంతర బడ్జెట్ (ఓట్-ఆన్‌-అకౌంట్)ను ప్రవేశపెట్టడానికి ఆర్ధికశాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఫిబ్రవరి 3వ వారంలో శాసనసభ, మండలిని సమావేశపరిచి దీనిని ప్రవేశపెట్టబోతున్నట్లు సమాచారం. 

రాబోయే మూడు నెలలకు ఖర్చుల నిమిత్తం రూపొందిస్తున్న మధ్యంతర బడ్జెట్ మాత్రమే కనుక దీనిపై ఉభయసభలలో పెద్దగా చర్చలు ఉండవు. కనుక దీనిపై క్లుప్తంగా చర్చించి, ఆమోదించేందుకు రెండు లేదా మూడు రోజులు ఉభయసభల సమావేశపరుస్తారు. 

ఏప్రిల్ 1వ తేదీ నుంచి పెంచిన పెన్షన్లను ఇస్తామని సిఎం కేసీఆర్‌ ప్రకటించినందున ఈ మధ్యంతర బడ్జెట్‌లోనే పెన్షన్ల పెంపు ప్రతిపాదనలను అధికారులు సిద్దం చేస్తున్నారు. వాటి కోసం దీనిలో రూ.3,174 కోట్లు కేటాయించనున్నట్లు సమాచారం.

కేంద్రబడ్జెట్ ప్రవేశపెట్టలేదు కనుక పూర్తిస్థాయి రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టకపోవడాన్ని అర్ధం చేసుకోవచ్చు. కానీ ప్రభుత్వం కొలువుతీరి నెల్లన్నర రోజులైనా మంత్రివర్గం ఏర్పాటు చేయకుండా, ఆర్ధికమంత్రి లేకుండా ఆర్ధికశాఖ పనిచేస్తుండటం, అధికారులే మధ్యంతర బడ్జెట్‌ను కూడా ప్రవేశపెట్టడానికి సిద్దం అవుతుండటం చాలా విడ్డూరంగా ఉంది.


Related Post