తెలంగాణ పోలీసులను ఆశ్రయిస్తున్న ఏపీ నేతలు!

January 22, 2019


img

మొన్న వైసీపీ అధినేత జగన్ సోదరి షర్మిల...ఇవాళ్ళ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కెఏ పాల్...ఇలాగా ఏపీకి చెందిన రాజకీయనాయకులు ఒకరొకరుగా తెలంగాణ పోలీసులను ఆశ్రయిస్తుండటం విశేషం. తనపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని షర్మిలా హైదరాబాద్‌ నగర పోలీస్ కమీషనర్ అంజనీకుమార్‌ను కోరిన సంగతి తెలిసిందే. ఇవాళ్ళ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కెఏపాల్ కూడా హైదరాబాద్‌ వచ్చి అంజనీకుమార్‌ను కలిసి తనపై ప్రింట్, ఎలక్ట్రానిక్ అండ్ సోషల్ మీడియాలో కొందరు పనిగట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదు చేశారు.

తనను హత్య చేసేందుకు జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబునాయుడు కుట్ర పన్నుతున్నారని కనుక వారి నుంచి తనకు రక్షణ కల్పించాలని కోరారు. ప్రజాశాంతి పార్టీ ఎన్నికలలో పోటీ చేస్తుందని ప్రకటించినప్పటి నుంచి చంద్రబాబునాయుడు గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయని కెఏ పాల్ అన్నారు. అందుకే తనను ఏపీలో స్వేచ్ఛగా సభలు, సమావేశాలు పెట్టుకొనీయకుండా చంద్రబాబునాయుడు అడ్డుకొంటున్నారని అన్నారు. దేశవిదేశాల ప్రముఖులతో కలిసి తిరిగే తనకు ఏపీలో స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి లేకుండాపోయిందని అన్నారు.

త్వరలో జరుగబోయే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలలో చంద్రబాబునాయుడు, జగన్మోహన్ రెడ్డి ఇద్దరూ ఓడిపోవడం ఖాయమని కెఏ పాల్ జోస్యం చెప్పారు. కేంద్రంలో మళ్ళీ నరేంద్రమోడీని రానీయకుండా అడ్డుకునేందుకు తాను 18 పార్టీలతో కలిసి పనిచేస్తున్నానని చెప్పారు. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడిగా త్వరలోనే తాను తెలంగాణ సిఎం కేసీఆర్‌ను కలిసి మాట్లాడుతానని చెప్పారు. తన తమ్ముడి హత్య కేసులో తనను అక్రమంగా ఇరికించారని కెఏ పాల్ ఆవేదన వ్యక్తం చేశారు.


Related Post