అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లకు పోటీగా రిలయన్స్

January 22, 2019


img

 జియోతో టెలికాం రంగంలో సంచలనం సృష్టించి, దేశంలో టెలికాం సంస్థలను గడగడలాడిస్తున్న ముఖేష్ అంబానీ, త్వరలో ఇ-కామర్స్‌ (ఆన్‌లైన్‌ మార్కెట్) రంగంలోకి ప్రవేశించబోతున్నట్లు ప్రకటించారు. ముందుగా గుజరాత్‌లోని తమ రిటైలర్లు, రిలయన్స్ స్టోర్ యాజమానుల కోసం దీనిని ప్రారంభిస్తామని ముఖేష్ అంబానీ తెలిపారు. ఆ తరువాత క్రమక్రమంగా దేశమంతటికీ తమ ఆన్‌లైన్‌ సేవలు విస్తరిస్తామని తెలిపారు. ప్రస్తుతం దేశంలో 6500 నగరాలు, పట్టణాలలో 10వేలకు పైగా రిలయన్స్ రిటైల్ సంస్థలున్నాయి. వాటిలో బంగారు ఆభరణాల మొదలు బట్టలు, గృహోపకరణలు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, చివరికి చెప్పులు కూరగాయల వంటివి కూడా అమ్మకాలు సాగుతున్నాయి. రిలయన్స్ సంస్థకు ఇప్పటికే దేశవ్యాప్తంగా జియో మొబైల్ నెట్, అలాగే ఫైబర్ నెట్ వర్క్ ఉండనే ఉన్నాయి. అలాగే రిలయన్స్ గ్రూప్ సంస్థలకు దేశవ్యాప్తంగా కోట్లాదిమంది వినియోగదారులున్నారు. కనుక రిలయన్స్ సంస్థ పెద్దగా కష్టపడకుండానే ఆన్‌లైన్‌ మార్కెటింగ్ వ్యాపారంలో నిలద్రొక్కుకోగలదని భావించవచ్చు.  

రిలయన్స్ జియో ఎంట్రీతో దేశంలో టెలికాం సంస్థలన్నీ చాలా భారీగా నష్టపోవడమే కాకుండా నేటికీ జియోతో పోటీ పడలేక విలవిలలాడుతున్నాయి. ఇప్పుడు రిలయన్స్ ఆన్‌లైన్‌ మార్కెటింగ్ వ్యాపారంలో కూడా ప్రవేశించినట్లయితే ఇంతవరకు ఆ రంగంలో అగ్రగాములుగా కొనసాగుతున్న అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ సంస్థలు కూడా ఎంతో కొంత నష్టపోయే అవకాశాలుండవచ్చు.


Related Post