బిజెపిలో మోడీకి బదులు ఎవరైనా ఉన్నారా?

January 21, 2019


img

పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలో మొన్న కోల్‌కతాలో నిర్వహించిన ర్యాలీకి దేశంలోని 23 ప్రాంతీయపార్టీల అధినేతలు హాజరయ్యి మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని గర్జించారు. 

వారి కూటమికి ప్రధానమంత్రి అభ్యర్ధి ఎవరో కూడా చెప్పుకోలేని స్థితిలో ఉన్నారని బిజెపి ఘాటుగా జవాబిచ్చింది. అది వాస్తవం కూడా. 

విపక్ష కూటమిలో రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ, మాయావతి, శరద్ పవార్, ములాయం సింగ్ వంటి అరడజనుమంది ప్రధానమంత్రి రేసులో ఉన్నారు. కనుక కూటమి ప్రధాని అభ్యర్ధి ఎవరో ముందుగా ప్రకటించలేనిస్థితిలో ఉంది. ఒకవేళ ధైర్యం చేసి ప్రకటిస్తే కూటమిలో ప్రధాని పదవి ఆశిస్తున్న పార్టీలు వెంటనే తప్పుకొంటాయి. అప్పుడు కూటమి కుప్పకూలిపోతుంది. అందుకే ప్రధాని ఎవరనేది ఇప్పుడు ముఖ్యం కాదని ముందుగా నరేంద్రమోడీని గద్దె దింపడమే తమ లక్ష్యమని సర్ధిచెప్పుకొంటున్నారు. కానీ ఒకవేళ లోక్‌సభ ఎన్నికలలో ఏ కూటమి గెలిచినా అప్పుడూ వాటికి ఇదే సమస్య ఎదురవుతుంది. కనుకనే కూటమి ప్రధాని ఎవరంటూ బిజెపి నిలదీస్తోంది. 

బిజెపికి సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఘాటుగా బదులిచ్చారు. “ప్రస్తుతం దేశం మార్పు కోరుకొంటోంది. ముఖ్యంగా మోడీ స్థానంలో కొత్త ప్రధాని రావాలని కోరుకొంటోంది. కనుక బిజెపిలో మోడీ కాకుండా మరో ప్రధాని అభ్యర్ధి ఉంటే చెప్పండి,” అని సవాలు విసిరారు. 

మోడీని ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించబట్టే గత ఎన్నికలలో బిజెపి, దాని మిత్రపక్షాలు ఘనవిజయం సాధించాయి. అయితే గత నాలుగున్నరేళ్ళలో ప్రధాని మోడీ తీసుకున్న కొన్ని నిర్ణయాల కారణంగా దేశంలో ఆయన పట్ల కొంత వ్యతిరేకత నెలకొన్న మాట వాస్తవం. కానీ మోడీని మార్చాలనే అంత వ్యతిరేకత ఉందని చెప్పలేము. మోడీ నిర్ణయాల వలన చాలా మంది నష్టపోయుండవచ్చు కానీ దేశ ప్రయోజనాల కోసమే ఆయన కటినమైన, సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారని నేటికీ చాలా మంది ప్రజలు అభిప్రాయపడుతున్నారు. మోడీ తప్ప మరే ప్రధాని అంతా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోలేరనే వాదన కూడా వినిపిస్తోంది. కనుక మోడీని మార్చవలసిన అవసరం ఉందని బిజెపి భావించడం లేదు కనుక మోడీకి బదులు ఎవరనే అఖిలేశ్ యాదవ్ ప్రశ్న అర్ధరహితమే. కనుక ప్రధాని అభ్యర్ధి గురించి బిజెపిని ప్రశ్నించేబదులు ఎన్నికలకు ముందుగానే తమ ప్రధాని అభ్యర్ధిని ప్రకటించడానికి ప్రయత్నిస్తే బాగుంటుంది. 


Related Post