కేసీఆర్‌ ప్రధాని కావాలి: వేముల

January 21, 2019


img

గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ శాసనసభలో నిన్న జరిగిన చర్చలో పాల్గొన్న తెరాస ఎమ్మెల్యే వేముల ప్రశాంతరెడ్డి మాట్లాడుతూ, “దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి దేశాన్ని పాలించిన కాంగ్రెస్‌, బిజెపిలు దేశాన్ని అభివృద్ధి చేయలేకపోయాయి. కానీ సిఎం కేసీఆర్‌ కేవలం నాలుగున్నరేళ్ళలో తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి చూపారు. అది చూసి యావత్ దేశం ఆశ్చర్యపోతోంది. కనుక కేసీఆర్‌ వంటి సమర్ధుడైన నాయకుడు దేశానికి ప్రధానమంత్రి కావలసిన అవసరముంది. జాతీయరాజకీయాలలో గుణాత్మకమైన మార్పు కోసం సిఎం కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు చేయడానికి ఇప్పటికే పలురాష్ట్రాలలో పర్యటించి ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చలు జరుపుతునారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా కేసీఆర్‌ నాయకత్వాన్ని అంగీకరించే సమయం వస్తుంది. ఎందుకంటే దేశానికి కేసీఆర్‌ వంటి నాయకుడి అవసరం ఉంది,” అని అన్నారు.

సిఎం కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌ ప్రతిపాదన తెరపైకి తెచ్చినప్పుడు “జాతీయరాజకీయాలలో గుణాత్మకమైన మార్పు” అనే సరికొత్తపదాలను పలికారు. కాంగ్రెస్‌, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పుకొంటున్నారు. కానీ ఆయనకు కూడా ప్రధానమంత్రి కావాలనే కోరిక ఉందని తెరాస నేతల మాటల ద్వారా స్పష్టం అవుతోంది. ఈవిధంగా మాట్లాడుతున్న తెరాస నేతలను కేసీఆర్‌ ఏనాడూ వారించకపోవడం గమనిస్తే ఆయనకు ఆ ఉద్దేశ్యం ఉన్నట్లే భావించవచ్చు.

అయితే కేసీఆర్‌ గొప్పదనాన్ని, నాయకత్వాన్ని తెరాస నేతలు, కార్యకర్తలు, తెలంగాణ ప్రజలు అంగీకరించవచ్చునేమో కానీ ఇతర రాష్ట్రాలలోని ప్రాంతీయపార్టీలు అంగీకరిస్తాయనుకోవడం అత్యాసే అవుతుంది. ప్రధాని పదవి ఆశిస్తున్న మాయావతి, మమతా బెనర్జీవంటివారు కేసీఆర్‌ ప్రధానమంత్రి అయ్యేందుకు ఎందుకు అంగీకరిస్తారు? కనుక ‘కేసీఆర్‌ ప్రధాని కావలసిన అవసరం చాలా ఉందంటూ’ తెరాస నేతలు పదేపదేపాటపాడితే, ఆయన ఆ ఉద్దేశ్యంతోనే ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు చేస్తున్నారని ఉత్తరాదిపార్టీలకు అనుమానం కలుగవచ్చు. అప్పుడు ఎవరూ కేసీఆర్‌కు సహకరించకపోవచ్చు.

పైగా తెరాస నేతలు కేసీఆర్‌ ప్రధాని కావాలని చెపుతుంటే కాంగ్రెస్, బిజెపిలకు అది మంచి ఆయుధం అందించినట్లే అవుతుందనే సంగతి మరిచిపోకూడదు. జాతీయరాజకీయాలలో గుణాత్మకమైన మార్పు కోసమే ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు చేస్తున్నానని  పైకి చెపుతూ తాను ప్రధానమంత్రి అయ్యేందుకే కేసీఆర్‌ ఫ్రంట్ ఏర్పాటు చేస్తున్నారా? అని ప్రశ్నించకమానవు.

ఫెడరల్‌ ఫ్రంట్‌ ప్రతిపాదనతో కాంగ్రెస్ మిత్రపక్షాలను చీల్చి లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసి, ప్రధాని నరేంద్రమోడీకి సహకరించేందుకే కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు చేస్తున్నారని ఇప్పటికే పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నప్పుడు, తెరాస నేతలు ‘కేసీఆర్‌ ప్రధాని కావాలనే’ పాట పాడుతుంటే ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పడకుండా నిలిచిపోయే అవకాశం ఉంటుందని గ్రహిస్తే మంచిది.


Related Post