ఐదేళ్ళలో రాష్ట్ర ఆదాయం రూ.10 లక్షల కోట్లు!

January 21, 2019


img

గవర్నర్ నరసింహన్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ శాసనసభలో నిన్న జరిగిన చర్చలో పాల్గొన సిఎం కేసీఆర్‌ పలు ఆసక్తికరమైన విషయాలు తెలియజేశారు. 

“రాబోయే ఐదేళ్ళలో రాష్ట్ర ఆదాయం రూ.10 లక్షల కోట్లు చేరుకొంటుంది. దానిలో రూ.2.40 లక్షల కోట్లు అప్పులు చెల్లించగా మిగిలిన దానిలో రూ.5 లక్షల కోట్లు రాష్ట్రాభివృద్ధి, సంక్షేమ పధకాల అమలుకు ఖర్చు చేస్తాం. మా మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలనన్నిటినీ ఖచ్చితంగా అమలుచేస్తాం. అయితే వాటిని అమలుచేయడానికి ప్రజలు మాకు ఐదేళ్ళు సమయం ఇచ్చారు. పెంచిన పెన్షన్ మొత్తాలు ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలు చేస్తాం. ఈసారి రూ.24,000 కోట్లు పంటరుణాలు మాఫీ చేస్తాం. ఈసారి కూడా వాటిని వాయిదాలలోనే మాఫీ చేస్తాం. నిరుద్యోగభృతి అమలు చేయడానికి ముందు అధ్యయనం చేయాలి. విధివిధానాలు రూపొందించుకోవాలి. కనుక దానికి కొంత సమయం పడుతుంది,” అని చెప్పారు. 

సాగునీటి ప్రాజెక్టుల గురించి వివరిస్తూ, “గత నాలుగున్నరేళ్ళలో సాగునీటి ప్రాజెక్టులపై రూ.99,000 కోట్లు ఖర్చు చేశాం. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తికావాలంటే మరో రూ.1.17 లక్షల కోట్లు అవసరం. మొత్తం రూ.2.25 లక్షల కోట్లు వ్యయంతో రాష్ట్రంలో 1.25 కోట్ల ఎకరాలకు నీళ్ళు అందించాలనేది మా లక్ష్యం. కనుక పాత అప్పులు కొంత చెల్లించినట్లయితే మళ్ళీ కొత్తగా మరో రూ.1.30 లక్షల కోట్లు అప్పు లభిస్తుందని అంచనా వేస్తున్నాము,” అని చెప్పారు. 

రైతు బంధు, బీమా పథకాలను కొనసాగిస్తామని సిఎం కేసీఆర్‌ తెలిపారు. కానీ కౌలు రైతులకు రైతుబంధు పధకం వర్తింపజేయడం సాధ్యం కాదని మరోసారి స్పష్టం చేశారు. కేసీఆర్‌ కిట్స్  పధకం కోసం కేంద్రప్రభుత్వం నిధులేవీ ఇవ్వడం లేదని రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా భరిస్తోందని తెలిపారు. నియోజకవర్గానికి లేదా మండలానికి ఒకటి చొప్పున ఆహార ఉత్పత్తుల ప్రాశసింగ్ సెంటర్లను ప్రారంభిస్తామని తెలిపారు. వాటి నిర్వహణ బాధ్యతను ఇందిరా క్రాంతి పథం (ఐకేపీ) ఉద్యోగులకు అప్పగిస్తామని తెలిపారు. సంగారెడ్డితో పాటు 5 జిల్లాలో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తామని సిఎం కేసీఆర్‌ తెలిపారు.


Related Post