వన్ ప్లస్ టూ ఆఫర్ ఇస్తాం: చంద్రబాబు

January 18, 2019


img

ఇంతకాలం ఏపీలో టిడిపి నేతలు వైకాపాతో మాత్రమే పోరాడుతుండేవారు కానీ బిజెపితో కటీఫ్ చెప్పేసాక వారి ఫోకస్ వైసీపీ నుంచి ప్రధాని నరేంద్రమోడీపైకి మారింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తరువాత చంద్రబాబునాయుడుకి కేసీఆర్‌ రిటర్న్ గిఫ్ట్ ప్రకటించడంతో ఇప్పుడు చంద్రబాబు ఫోకస్ కేసీఆర్‌పైకి మళ్ళింది. అయితే కేసీఆర్‌తో పాటు నరేంద్రమోడీ, జగన్మోహన్ రెడ్డిలను కలిపి ఎదుర్కొనేందుకు ప్రయత్నిస్తున్నారు. వారు ముగ్గురూ కలిసి ఏపీ రాష్ట్రాభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నారని ఆరోపిస్తున్నారు చంద్రబాబు.

ఈరోజు గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ చేసిన తరువాత ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “కేసీఆర్‌ నాకేదో రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని బెదిరిస్తున్నారు. ఆయన ఒక గిఫ్ట్ ఇస్తే మనం మూడు గిఫ్టులు ఇస్తాం. మనమేమీ చాతకాని వాళ్ళం కాదు. మనకి నరేంద్రమోడీతో సఖ్యతగా ఉన్నంతకాలం కేసీఆర్‌ నోరువిప్పి మాట్లాడాలేదు. మనతో మంచిగానే ఉన్నారు. కానీ మనకి మోడీకి దూరం పెరిగాక మనపై కుట్రలు చేయడం ప్రారంభించారు. కేంద్రం మనకు సహాయ నిరాకరణ చేస్తున్నా ఇక్కడ అభివృద్ధి ఆగలేదు సంక్షేమ పధకాలు ఆగలేదు. అందుకే నరేంద్రమోడీకి మనపై కక్ష కట్టారు.

తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ ఒకపక్క రాష్ట్రాన్ని శరవేగంగా అభివృద్ధి చేస్తూనే మరోపక్క తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పధకాలకంటే ఎక్కువే అమలుచేస్తున్నాము. కేసీఆర్‌ ఒక్క రైతులకు మాత్రమే జీవితభీమా ఇస్తున్నారు. కానీ నేను రాష్ట్రంలో ప్రజలందరికీ భీమా సౌకర్యం కల్పిస్తున్నాను. కేసీఆర్‌ ఎన్నికలలో గెలిచిన తరువాత పెన్షన్ పెంచుతుంటే మేము ఎన్నికలకు చాలా ముందే నెలకు రూ.2000 చొప్పున పెన్షన్లు పెంచి ఇస్తున్నాము. మనతో అభివృద్ధి, సంక్షేమా కార్యక్రమాలలో పోటీపడలేకనే కేసీఆర్‌ అసూయతో జగన్మోహన్ రెడ్డిని ఉపయోగించుకొని రాష్ట్రాభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నారు.

ఒకపక్క పెద్ద మోడీ, మరోపక్క తెలంగాణ మోడీ, ఇంకోపక్క ఇక్కడ కోడికత్తి మోడీ ముగ్గురూ కలిసి మనల్ని దెబ్బ తీయడానికి వస్తున్నారు. అయితే వారి ఆటలు ఇక్కడ సాగవని గ్రహిస్తే మంచిది,” అని చంద్రబాబునాయుడు అన్నారు.


Related Post