అందుకే తెరాసలో చేరాను: వంటేరు ప్రతాప్ రెడ్డి

January 18, 2019


img

ఊహించినట్లుగానే సీనియర్ కాంగ్రెస్‌ నేత వంటేరు ప్రతాప్ రెడ్డి ఈరోజు సాయంత్రం తెలంగాణ భవన్‌లో తెరాసలో చేరిపోయారు. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ ఆయనకు గులాబీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ప్రతాప్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “నిజానికి నన్ను తెరాసలో చేరమని కేటీఆర్‌ గతంలోనే కోరారు కానీ చేరలేదు. ఈసారి ఆయన కాస్త గట్టిగా పట్టుబట్టడంతో ఆయనపై ఉన్న గౌరవంతో తెరాసలో చేరుతున్నాను. కేసీఆర్‌ గజ్వేల్ నియోజకవర్గాన్ని చాలా అభివృద్ధి చేశారు. అయినప్పటికీ నేను ఎమ్మెల్యేనైతే నా నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి చేసుకోవచ్చనే ఆలోచనతోనే నేను కేసీఆర్‌పై పోటీకి దిగాను తప్ప ఆయనపై వ్యక్తిగతంగా నాకు ఎటువంటి ద్వేషం, వ్యతిరేకత లేదు.

గత నాలుగున్నరేళ్ళుగా ఆయన ప్రవేశపెట్టిన అనేకానేక సంక్షేమ పధకాలను చూసి నేను సైతం చాలా ముగ్దుడనయ్యాను. ఆ పధకాలే తెరాసను మళ్ళీ గెలిపించాయని భావిస్తున్నాను. నా నియోజకవర్గంలో మల్లన్నసాగర్‌, కొండపోచమ్మ ప్రాజెక్టుల కొరకు ప్రభుత్వం భూసేకరణ చేస్తున్నప్పుడు నేను తీవ్రంగా వ్యతిరేకించాను. పోలీసుల చేత లాఠీదెబ్బలు కూడా తిన్నాను. కానీ ఆనాడు కేసీఆర్‌ తీసుకొన్న నిర్ణయాలు సరైనవేనని తాజా ప్రజాతీర్పుతో స్పష్టం అయ్యింది. నన్ను పార్టీలోకి ఆహ్వానించినందుకు కేటీఆర్‌ గారికి తెలుపుకొంటున్నాను. పార్టీ నాకు ఎటువంటి బాధ్యతలు అప్పగించినా చిత్తశుద్దితో నిర్వర్తిస్తాను,” అని అన్నారు.


Related Post