ఏపీ రాజకీయాలలో కేసిఆర్ కీలకపాత్ర: తలసాని

January 07, 2019


img

మాజీ మంత్రి తెరాస ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ చంద్రబాబునాయుడు, టిడిపి పాలనపై విమర్శలు చేశారు. ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “స్వర్గీయ ఎన్టీఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకిస్తూ తెలుగుదేశం పార్టీని స్థాపిస్తే ఆయన అల్లుడు చంద్రబాబునాయుడు అదే కాంగ్రెస్ పార్టీకి గులామీ చేస్తున్నారు. ఏపీలో చంద్రబాబు పరిపాలన చేయకుండా ప్రతిపక్ష పార్టీలాగ దీక్షలు చేస్తుండటం చాలా విడ్డూరంగా ఉంది. గత నాలుగున్నరేళ్లలో చంద్రబాబు చేసిందేమీ లేదు అందుకే ప్రచారంతోనే కాలక్షేపం చేస్తున్నారు. ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాలలో తెలుగు ప్రజలు సుఖంగా, సంతోషంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ కోరుకొంటున్నారు. ఏపీ ప్రజలు కూడా కేసిఆర్ పాలనను మెచ్చుకొంటున్నారు. కనుక ఇకపై ఏపీ రాజకీయాలలో కూడా సిఎం కేసిఆర్ కీలకపాత్ర పోషించనున్నారు. రాబోయే నాలుగు నెలలోగా దేశరాజకీయాలలో పెనుమార్పులు సంభవించనున్నాయి. సిఎం కేసీఆర్ ఏర్పాటు చేస్తున్న ఫెడరల్ ఫ్రంట్ జాతీయ రాజకీయాలను మార్చబోతోంది,” అని అన్నారు. 

ఏపీ రాజకీయాలలో కేసిఆర్ జోక్యం చేసుకొంటానని నెలరోజుల క్రితమే చెప్పారు. అయితే తెలంగాణ రాష్ట్రానికే పరిమితమైన తెరాస ఏపీలో పోటీ చేయదలచుకుంటే, తెరాస-ఏపీ శాఖను ఏర్పాటు చేసుకోవలసి ఉంటుంది. కానీ సిఎం కేసీఆర్ తెరాసను ఏపీకి విస్తరించే ఆలోచన చేస్తున్నట్లు లేదు కనుక టిడిపిని, చంద్రబాబునాయుడుని వ్యతిరేకిస్తున్న వైకాపా, జనసేన, సిపిఎం తదితర పార్టీలకు అవసరమైన సహాయ సహకారాలు అందజేసి, టిడిపిని ఓడించి చంద్రబాబునాయుడును గద్దె దించే ప్రయత్నాలు చేస్తారని అర్ధమవుతోంది. కానీ కేసిఆర్ వ్యూహానికి అప్పుడేచంద్రబాబునాయుడు కౌంటరు వ్యూహం సిద్దం చేసి అమలుచేస్తున్నారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వడానికి వీలులేదని అడ్డుపడుతున్న కేసిఆర్, తెరాసతో చేతులు కలిపి ఏపీ ప్రయోజనాలకు విరుద్దంగా వ్యవహరిస్తున్న పార్టీలకు ఎన్నికలలో గట్టిగా బుద్ది చెప్పాలని టిడిపి జోరుగా ప్రచారం చేస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్-టిడిపి కూటమి ఎదుర్కోవడానికి తెరాస అమలుచేసిన వ్యూహాన్నే ఏపీలో తెరాస-వైకాపా-బిజెపిలను ఎదుర్కోవడానికి ప్రయోగించబోతున్నట్లు స్పష్టం అవుతోంది. కనుక జగన్, పవన్ తెరాసతో బహిరంగంగా చేతులు కలపడానికి ఇష్టపడకపోవచ్చు.ఒకవేళ కలిపితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో ప్రజాకూటమికి ఎదురైన చేదు అనుభవమే ఎదురవవచ్చు. 


Related Post