కేరళ అశాంతి ఎవరు బాధ్యత వహిస్తారు?

January 04, 2019


img

ఒక్క ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది అన్నట్లు పాలకుల నిర్ణయాలు ప్రజల జీవితలను ఎంతగా ప్రభావితం చేస్తాయో తెలుసుకునేందుకు కేరళ రాష్ట్రం ఉదాహరణగా కనిపిస్తోంది.

కేరళ అంటే పర్యాటకులకు స్వర్గధామం...అయ్యప్ప భక్తులకు మోక్షధామం.. ప్రకృతి ప్రేమికులకు భువిపై వెలసిన ప్రకృతి నిలయంగా ఉండేది. కానీ అయ్యప్పస్వామి ఆలయంలోకి అన్ని వయసుల మహిళలు ప్రవేశించవచ్చుననే సుప్రీంకోర్టు తీర్పుతో ఇప్పుడు కేరళలో నిత్యం అశాంతి, అల్లకల్లోలం మొదలైంది.  

ప్రభుత్వాదేశాల మేరకు కేరళ పోలీసులు స్వయంగా ఇద్దరు మహిళలను బుదవారం తెల్లవారుజామున శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలోకి ప్రవేశపెట్టడంతో కేరళ రాష్ట్రం ఇప్పుడు అట్టుడుకుతోంది.

ప్రభుత్వ తీరును నిరసిస్తూ శబరిమల కర్మ సమితి నిన్న రాష్ట్ర బంద్‌కు పిలుపునివ్వగా దానికి బిజెపి, కాంగ్రెస్ పార్టీలతో పలు ప్రజాసంఘాలు మద్దతు పలికాయి. అధికార వామపక్ష కూటమి కార్యకర్తలకు, ఆందోళనకారులకు మద్య ఘర్షణలు జరిగాయి. ఇవి సరిపోవన్నట్లు అతివాద ఇస్లామిక్‌ సంస్థ సోషల్‌ డెమోక్రటిక్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా కార్యకర్తలు కూడా బంద్‌ను వ్యతిరేకిస్తూ ర్యాలీలు నిర్వహించడానికి బయలుదేరడంతో వారికీ బీజేపీ కార్యకర్తలకు మద్య ఘర్షనలు జరిగాయి. పథనంతిట్ట అనే ప్రాంతంలో ఇరువర్గాలకు మద్య జరిగిన ఘర్షణలో ఒక వ్యక్తి మరణించాడు.

తిరువనంతపురం, మలప్పురం, పాలక్కాడ్‌, కోజికోడ్‌, కన్నూర్‌ తదితర పట్టణాలలో బంద్‌ హింసాత్మకంగా మారింది. కొన్ని చోట్ల ఆందోళనకారులు బస్సులపై రాళ్ళు రువ్వి వాహనాలను తగులబెట్టే ప్రయత్నాలు చేశారు. కానీ ఇటువంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని ముందే పసిగట్టిన కేరళ పోలీస్ శాఖ ఎక్కడికక్కడ భారీగా పోలీసులను మోహరించడంతో పరిస్థితులు అదుపుతప్పకుండా నియంత్రించగలిగారు.

అయ్యప్పస్వామి ఆలయంలోకి మహిళలను ప్రవేశాన్ని సమర్ధిస్తూ, వ్యతిరేకిస్తూ రాష్ట్రంలో అనేకమంది మహిళలు కూడా ర్యాలీలు చేపట్టడంతో వారి మద్య కూడా కొన్ని ప్రాంతాలలో ఘర్షణలు జరిగినట్లు సమాచారం. నిన్న రాష్ట్రవ్యాప్తంగా మార్కెట్లు, విద్యాసంస్థలు, సినిమా ధియేటర్లు అన్నీ మూతపడ్డాయి. 

 అయ్యప్ప స్వామి ఆలయంలో మహిళల ప్రవేశంపై యావత్ సమాజం రెండుగా చీలిపోయినందున ఈ సమస్య ఎప్పటికీ పరిష్కారం లభిస్తుందో తెలియదు. పాలకులు, చట్టాలు, న్యాయస్థానాలు అందరూ ప్రజలందరినీ కలిపే ప్రయత్నాలు చేయాలి కానీ ఈవిధంగా సమాజాన్ని రెండుగా చీలిపోయే నిర్ణయాలు తీసుకోవడం సరికాదు. కేరళలో రగులుకొన్న ఈ అశాంతికి ఎవరు బాధ్యత వహిస్తారు?



Related Post