కెసిఆర్ కు సోమిరెడ్డి కౌంటర్

December 29, 2018


img

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు సాయంత్రం ప్రగతిభవన్ లో మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఉద్దేశించి, "ఆయనకు గట్టిగా నాలుగు ముక్కలు ఇంగ్లీషులో మాట్లాడటం రాదు రెండు ముక్కలు హిందీలో మాట్లాడటం రాదు కానీ ఢిల్లీలో చక్రం తిప్పుతానంటాడు. ఢిల్లీలో చక్రం తిప్పడం సంగతి అటుంచి ముందు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుస్తాడో లేదో తెలుసుకుంటే మంచిది. రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో చంద్రబాబు నాయుడు... ఆయన పార్టీ ఘోరపరాజయం కావడం తధ్యం.  ఈ ఐదేళ్లలో అతను చేసింది ఏమీ లేదు... అందుకే కల్లబొల్లి కబుర్లతో కాలక్షేపం చేశారు. అమరావతిలో సచివాలయం భవనానికి రాప్ విధానంలో పునాది వేశామని గొప్పలు చెప్పుకున్నాడు కానీ తెలంగాణ రాష్ట్రంలో ఆవిధంగా పునాది వేయబడిన భవనాలు కొన్ని వేలున్నాయి. మిషన్ భగీరథతో సహా అనేకచోట్ల అటువంటి విధానంలోనే పునాదులు వేసి నిర్మించాము. కానీ అదేదో తను కొత్తగా కనిపెట్టినట్లు గొప్పలు చెప్పుకుంటున్నారు. 

ఇంతకాలం ప్రధానిమోడీతో అంటకాగిన చంద్రబాబు ఎన్నికలు దగ్గర పడగానే ప్రజలు తన వైఫల్యాలకు శిక్షిస్తారని భయపడి ఇప్పుడు మోడీని తిడుతున్నాడు. అప్పుడు రాహుల్ గాంధీని తిట్టిపోసిన చంద్రబాబు ఇప్పుడు అతనితోనే అంటకాగుతున్నారు. చంద్రబాబుకు ఒక నీతి నియమం ఏమీ లేవు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు అతనిని ఎలా భరిస్తున్నారో తెలియదు కానీ ఈసారి అసెంబ్లీ ఎన్నికలలో అతనిని ఓడించడం ఖాయం," అని కేసీఆర్ అన్నారు

కెసిఆర్ చేసిన ఈ వ్యాఖ్యలపై టిడిపి ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందిస్తూ "కేసీఆర్ వాడిన భాష చాలా నీచంగా ఉంది. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి సాటి ముఖ్యమంత్రి గురించి ఇంత నీచంగా మాట్లాడటం చాలా దారుణం. 

కేసీఆర్ గొప్ప మాటకారి అయ్యుండవచ్చు. ఆయనకు హిందీ, ఉర్ధూ, ఇంగ్లీషు భాషలలో మంచి ప్రావీణ్యం ఉండి ఉండొచ్చు. కానీ బాగా మాట్లాడగలిగినవారే గొప్ప ముఖ్యమంత్రి అనుకోలేము. ఆ లెక్కన నా మనవడు కూడా ఇంగ్లీష్ బాగానే మాట్లాడుతాడు అంతమాత్రాన అతనిని ముఖ్యమంత్రి చేయలేము కదా. మనం చెప్పదలచుకున్న విషయం ఇతరులకు సరిగ్గా అర్థం అయితే చాలు.  చంద్రబాబు నాయుడు ఏమి చేయగలరనేది భవిష్యత్తులో కెసిఆరే స్వయంగా చూస్తారు. 

కెసిఆర్ గత నాలుగేళ్లలో చేసిందేమీ లేదు. తీవ్ర ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సాధించినంత అభివృద్ధి ధనిక రాష్ట్రమైన తెలంగాణ సాధించలేకపోయింది. అది కేసీఆర్ వైఫల్యం కాదా? అని ప్రశ్నిస్తున్నాను. కేసీఆర్ ఎన్నికలలో మాయమాటలు చెప్పి... పోల్ మేనేజిమెంటు చేసి గెలిచి అదేదో ఘనకార్యమన్నట్లు గొప్పగా చెప్పుకుంటున్నారు," అని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు.


Related Post