లోక్‌సభకు పోటీ చేస్తా: కోమటిరెడ్డి

December 28, 2018


img

అసెంబ్లీ ఎన్నికలలో అనూహ్యంగా ఓటమి పాలవడంతో క్రుంగిపోయిన సీనియర్ కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మెల్లగా ఆ షాక్ నుంచి తేరుకొని మళ్ళీ ప్రజల మద్యకు వచ్చారు. పెద్దసూరారం గ్రామంలో డా.బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ,“రాజకీయ పార్టీలకు, నాయకులకు గెలుపోటములు సహజమే. వాటిని చూసి క్రుంగిపోనవసరం లేదు... పొంగిపోనవసరంలేదు. సుమారు రెండు దశాబ్ధాలుగా నల్గొండ జిల్లా ప్రజల మధ్యనే ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేసిన కారణంగానే ప్రజలను నన్ను గుర్తుపెట్టుకొని ఇంతగా ఆదరిస్తున్నారు. పదవీ, అధికారం ఉన్నా లేకపోయినా ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటాను. ఎవరూ వేలెత్తి చూపలేనివిధంగా ఎల్లప్పుడూ నీతి నిజాయితీగా బ్రతికాను. ఇకపై కూడా అలాగే ఉంటాను. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆదేశిస్తే వచ్చే లోక్‌సభ ఎన్నికలలో నల్గొండ నుంచి పోటీ చేయడానికి నేను సిద్దంగా ఉన్నాను,” అని చెప్పారు. 

రెండు రోజుల క్రితమే రాష్ట్ర కాంగ్రెస్ కార్యదర్శి పటేల్ రమేశ్ రెడ్డి తాను వచ్చే లోక్‌సభ ఎన్నికలలో నల్గొండ నుంచి పోటీ చేయాలనుకొంటున్నట్లు ప్రకటించారు. ఈరోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా నల్గొండ నుంచే పోటీ చేస్తానని ప్రకటించారు. అంటే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో అప్పుడే లోక్‌సభ టికెట్ల కోసం పోటీ మొదలైందన్న మాట!

త్వరలో జరుగబోయే లోక్‌సభ ఎన్నికలు తరువాత మళ్ళీ ఐదేళ్ళ వరకు మరే ఎన్నికలు ఉండవు కనుక అన్నీ పార్టీలలో నేతలకు ఇవే చివరి అవకాశం. కనుక లోక్‌సభ టికెట్ల కోసం కాంగ్రెస్ నేతలు పోటీపడటంలో ఆశ్చర్యం లేదు.


Related Post