కేసీఆర్‌పై కాంగ్రెస్ ఆగ్రహం

December 25, 2018


img

సిఎం కేసీఆర్‌ కాంగ్రెస్, బిజెపీలకు ప్రత్యామ్నాయంగా దేశంలోని ప్రాంతీయ పార్టీలను కలుపుకొని జాతీయకూటమి ఏర్పాటు చేసే ప్రయత్నాలపై కాంగ్రెస్ పార్టీ చాలా తీవ్రంగా స్పదించింది. 

ఆ పార్టీ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ సోమవారం డిల్లీలో మీడియాతో మాట్లాడుతూ,“ఈ దేశంలో ఎవరు ఏ పార్టీలతోనైనా కలిసి పనిచేయవచ్చు. అయితే దేశంలో ప్రధానప్రతిపక్షపార్టీ (కాంగ్రెస్ పార్టీ)ని కలుపుకోకుండా, దానితో కలిసి పనిచేయాలనుకొంటున్న పార్టీలను కలుపుకుపోవాలనుకోవడం ‘విభజన రాజకీయాలు’ చేయడమే అవుతుంది. దీనివలన అంతిమంగా ఎవరికి లాభం కలుగుతుందంటే బిజెపీకేనని అర్ధమవుతోంది. 

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో మూడు బిజెపీ పాలిత రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. అదేవిధంగా 2019 లోక్ సభ ఎన్నికలలో కూడా మా మిత్రపక్షాలతో కలిసి పోటీచేసి విజయం సాధించి కేంద్రంలో అధికారంలోకి రాబోతోంది. కనుక కాంగ్రెస్ పార్టీని దెబ్బ తీసేందుకు జరుగుతున్న ఇటువంటి ప్రయత్నాలను మా మిత్రపక్షాలు గుర్తించాయనే మేము భావిస్తున్నాము. ఈ ఉచ్చులో ఎవరూ చిక్కుకొరనే భావిస్తున్నాము,” అని అన్నారు. 

పదేళ్లపాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీని 2014 ఎన్నికలలో దేశప్రజలు నిర్ద్వందంగా తిరస్కరించారు. కారణాలు అందరికీ తెలుసు. కానీ ఐదేళ్లు తిరిగేసరికి దేశప్రజలలో బిజెపీ, మోడీ పట్ల కూడా విముఖత కనబడుతోంది. దీనికీ కారణాలు అందరికీ తెలుసు. 

ఈ పరిస్థితులలో చంద్రబాబునాయుడు కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి దానికి మద్దతు కూడగట్టే ప్రయత్నాలు చేయడం, ఆయనకు పలు రాష్ట్రాలలో నేతలు సంఘీభావం ప్రకటిస్తుండటం వంటివి కాంగ్రెస్ పార్టీకి ఊహించని ‘బోనస్’ అని చెప్పుకోవచ్చు. ఇంత తక్కువ వ్యవధిలో మళ్ళీ తమకు దేశంలో మళ్ళీ ఇంత సానుకూలవాతావరణం ఏర్పడుతుందని బహుశః కాంగ్రెస్ అధిష్టానం కూడా ఊహించి ఉండకపోవచ్చు. కనుక ఈ అవకాశాన్ని వినియోగించుకొని మళ్ళీ కేంద్రంలో అధికారంలోకి రావాలని గట్టి ప్రయత్నాలు చేస్తోంది. 

సరిగ్గా ఇదే సమయంలో సిఎం కేసీఆర్‌ ‘ఫెడరల్ ఫ్రంట్’ ప్రతిపాదనతో దేశంలో కాంగ్రెస్ మిత్రపక్షాలన్నిటినీ తనవైపు తిప్పుకొనే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇది కాంగ్రెస్ పార్టీకి ఆగ్రహం కలిగించడం సహజమే. కనుకనే అభిషేక్ సింఘ్వీ ఈవిధంగా స్పందించి ఉండవచ్చు. 

అయితే కేసీఆర్‌ చేస్తున్న ఈ ప్రయత్నాలు బిజెపీని గెలిపించేందుకేనని కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరోపణలకు సిఎం కేసీఆర్‌ సంతృప్తికరమైన సమాధానం ఈయవలసి ఉంటుంది. అప్పుడే ఆయన ప్రయత్నాల పట్ల ప్రజలకు నమ్మకం ఏర్పడుతుంది. అయితే కాంగ్రెస్ మిత్రపక్షాలను ఆయన తనవైపు తిప్పుకోగలుగుతారా లేదా? అనేది మరొక 2-3 నెలలోపే తేలిపోతుంది. 


Related Post