ఆర్.బి.ఐ.గవర్నర్లకు శాపంగా మారిన స్వామి

December 24, 2018


img




బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి ఆర్.బి.ఐ.గవర్నర్ల పాలిట శాపంగా మారినట్లున్నారు. మాజీ ఆర్.బి.ఐ.గవర్నర్ రఘురామరాజన్ ఆయన నోటికి బలైపోయి, తన పదవీకాలంలో అత్యంత అవమానకర పరిస్థితులను ఎదుర్కొన్నారు. కానీ ప్రధాని నరేంద్రమోడీ, ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ వేరెవరూ కూడా సుబ్రహ్మణ్యం స్వామిని నియంత్రించే ప్రయత్నం చేయలేదు. దాంతో తీవ్ర ఆవేదన చెందిన రఘురామ రాజన్ తన పదవీకాలం పొడిగింపుకు కేంద్రప్రభుత్వం సానుకూలంగా ఉన్నప్పటికీ సున్నితంగా ఆ ఆఫర్ ను తిరస్కరించారు. 

ఆయన తరువాత ఆర్.బి.ఐ.గవర్నర్ గా బాధ్యతలు చేపట్టిన ఉర్జీత్ పటేల్ కూడా ఇంచుమించు అటువంటి చేదు అనుభవాలే ఎదుర్కొని ‘వ్యక్తిగత కారణాలతో’ పదవికి రాజీనామా చేసి తప్పుకొన్నారు. ఆయన తరువాత ఈనెల 11వ తేదీన శక్తికాంత్ దాస్ ఆర్.బి.ఐ.గవర్నర్ గా బాధ్యతలు చేపట్టారు. అప్పుడే ఆయనపై సుబ్రహ్మణ్యం స్వామి తీవ్ర ఆరోపణలు మొదలుపెట్టారు. 

ఇటీవల డిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో సుబ్రహ్మణ్యస్వామి మాట్లాడుతూ, “శక్తికాంత్ దాస్ ఒక అవినీతిపరుడు. అందుకే ఆయనను ఆర్ధికశాఖ నుంచి తప్పించాము. అటువంటి వ్యక్తిని ఆర్.బి.ఐ.గవర్నర్ గా నియమించడం చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఆయన వలన దేశ ఆర్ధిక వ్యవస్థకు చెడ్డపేరు వస్తుంది,” అని అన్నారు. 

శక్తికాంత్ దాస్ ను ఆర్.బి.ఐ.గవర్నర్ గా నియమించినప్పుడు పలువురు ఇటువంటి ఆరోపణలే చేశారు కనుక సుబ్రహమణ్యస్వామి వాదనలో ఎంతో కొంత నిజముండవచ్చు. కానీ తమ ప్రభుత్వమే ఆయనను నియమించినప్పుడు, దేశ బ్యాంకింగ్ వ్యవస్థను నడిపించే ఆయనపై ఇటువంటి ఆరోపణలు చేయడం ద్వారా తమ ప్రభుత్వం అవినీతిపరులకు ఉన్నతపదవులు కట్టబెట్టి అవినీతికి పాల్పడుతోందని సుబ్రహ్మణ్యస్వామి చాటింపు వేస్తున్నట్లుంది. తద్వారా ప్రతిపక్షపార్టీలకు తమ ప్రభుత్వాన్ని విమర్శించేందుకు బలమైన ఆయుధం అందించడమే కాకుండా ఆర్.బి.ఐ. దాని గవర్నర్ పనితీరుపై కూడా తీవ్రప్రభావం చూపుతున్నారు. 

శక్తికాంత్ దాస్ గురించి సుబ్రహ్మణ్యస్వామి తన అభిప్రాయం ప్రకటించేశారు కనుక ఇక నుంచి ఇదేవిధంగా ఆయనపై తీవ్ర ఆరోపణలుచేస్తూ ఆయన కూడా పదవి నుంచి తప్పుకొనేవరకు వెంటపడటం ఖాయమనే భావించవచ్చు. 


Related Post