దీదీతో అన్నీ మాట్లాడా: కేసీఆర్‌

December 24, 2018


img

తెలంగాణ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రులు కేసీఆర్‌, మమతా బెనర్జీ సోమవారం సాయంత్రం కోల్‌కతాలో భేటీ అయ్యారు. కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా జాతీయస్థాయిలో కూటమి ఏర్పాటు గురించి తామిరువురం చర్చించుకొన్నామని  కేసీఆర్‌ చెప్పారు. కూటమి ఏర్పాటుకు ప్రయాత్నాలు మొదలుపెట్టానని అతి త్వరలోనే సమగ్రమైన ప్రణాళికతో మళ్ళీ మీ ముందుకు వస్తామని సిఎం కేసీఆర్‌ మీడియాకు తెలిపారు. 

కొన్ని నెలల క్రితం కేసీఆర్‌ ఈ ఆలోచన చేసినప్పుడు ముందుగా కోల్‌కతా వెళ్ళి మమతాబెనర్జీతోనే భేటీ అయిన సంగతి అందరికీ తెలుసు. కానీ ఆమె ఒకపక్క  కేసీఆర్‌తో ఈవిధంగా చర్చలలో పాల్గొంటూనే మరోపక్క కాంగ్రెస్ పార్టీ చుట్టూ తిరుగుతున్నారు. దానికి బలమైన కారణమే ఉంది. 

వచ్చే లోక్ సభ ఎన్నికలలో ప్రధాని నరేంద్రమోడీని గద్దె దించి కాంగ్రెస్ మిత్రపక్షాలు అధికారంలోకి రావడానికి అవసరమైతే తాను ప్రధానమంత్రి రేసులో నుంచి తప్పుకోవడానికి సిద్దమని, మిత్రపక్షాలన్నీ అంగీకరిస్తే మమతా బెనర్జీ ప్రధానమంత్రి అభ్యర్ధిగా ప్రకటించడానికి కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి అభ్యంతరం లేదని ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కొన్ని నెలల క్రితం ప్రకటించారు. 

కనుక తాను ప్రధానమంత్రి అయ్యేందుకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తున్నప్పుడు ఆమె ఎందుకు కాదంటారు? అందుకే ఆమె కాంగ్రెస్ పార్టీవైపు మొగ్గు చూపుతున్నారు. పైగా ఏపీ సిఎం చంద్రబాబునాయుడు, శరత్ పవార్ తదితరులు దేశంలో బిజెపిని, నరేంద్రమోడీని వ్యతిరేకిస్తున్న పార్టీలను, నేతలను కాంగ్రెస్ నేతృత్వంలో కలిసి పనిచేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాలలో భాగంగానే చంద్రబాబునాయుడు కూడా కొన్ని రోజుల క్రితం కోల్‌కతా వెళ్ళి మమతాబెనర్జీతో సమావేశమయ్యారు. కనుక ఆమె ఒకేసారి రెండు పడవలలో కాళ్ళుపెట్టి ప్రయాణించాలనుకొంటున్నట్లు స్పష్టం అవుతోంది. 


కనుక ఆమె వారిద్దరిలో ఎటువైపు మొగ్గు చూపుతారని ఆలోచిస్తే కాంగ్రెస్ నేతృత్వంలో ఏర్పాటవుతున్న కూటమివైపే మొగ్గు చూపే అవకాశం ఉందని భావించవచ్చు. కనుక ఆమె చుట్టూ కేసీఆర్‌ ప్రదక్షిణాలు చేయడం వలన సమయం వృదా తప్ప ఉపయోగమేమీ ఉండకపోవచ్చు. రేపు కేసీఆర్‌ కలవబోతున్న అఖిలేశ్ యాదవ్, మాయావతి కూడా కాంగ్రెస్ పార్టీతో బలమైన అనుబందం కలిగి ఉన్న సంగతి అందరికీ తెలుసు. కనుక కెసిఆర్ ప్రయత్నాలు ఫలిస్తాయో లేదో చూడాలి.


Related Post