పార్టీ మారడం లేదు: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

December 24, 2018


img

అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పరాజయం ఆ పార్టీ రాష్ట్ర నేతల, కార్యకర్తల మనోధైర్యాన్ని దెబ్బ తీసిందని చెప్పక తప్పదు. ఇప్పటికే ఐదేళ్ళు ప్రతిపక్షబెంచీలలో కూర్చొన్న కారణంగా కాంగ్రెస్ నేతలు, నియోజకవర్గాలలో అధికార పార్టీ ఒత్తిళ్లను ఎదుర్కొంటున్న కారణంగా కాంగ్రెస్ కార్యకర్తలు తమ పార్టీ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు. మరో ఐదేళ్ళు ఈ సమస్యలను, ఒత్తిళ్ళను భరించడం కష్టమేననే అభిప్రాయంతో ఉన్నారు. పోనీ...ఓపికగా భరించినా ఐదేళ్ళ తరువాతైనా కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో గెలిచి అధికారంలోకి వస్తుందనే ఆశ, నమ్మకం కనిపించడం లేదు. భవిష్యత్ ఆగమ్యగోచరంగా కనిపిస్తునందున తెరాస నుంచి ఆఫర్లు వస్తే దానిలోకి వెళ్ళిపోవడమే మేలని కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు భావిస్తే ఆశ్చర్యం లేదు. 

అసెంబ్లీ ఎన్నికలకు చాలా కాలం ముందే అటువంటి ఆలోచనలు చేసిన కోమటిరెడ్డి సోదరులు ఇప్పుడు మళ్ళీ ఆవిధంగా ఆలోచిస్తే విచిత్రమేమీ కాదు. నల్గొండ జిల్లాలో మునుగోడు నుంచి గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి త్వరలో తెరాసలో చేరబోతున్నట్లు మీడియాలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ ఆయన వాటిని ఖండించారు. 

తనను గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుకొనేందుకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదివారం మునుగోడులో కృతజ్ఞత సభ నిర్వహించారు. ఆ సందర్భంగా ఆయన ప్రజలను, పార్టీ కార్యకర్తలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “కోమటిరెడ్డి  సోదరులం ఓటమిని చూసి భయపడే పిరికిపందలం కాము. తెరాస నేతలు మాపై ఎంతగా ఒత్తిడి చేసినా, ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా మేము ఎన్నటికీ ఆ పార్టీలో చేరము. కష్టమైనా నష్టమైనా మేము ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాము. మాకు పదవులు అధికారం ముఖ్యం కాదు. మా నియోజకవర్గంలో ప్రజల సంక్షేమమే ముఖ్యం. కనుక గెలుపోటములను పట్టించుకోకుండా యధాప్రకారం మేమిద్దరం ప్రజల మద్యనే ఉంటూ తెరాస ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తుంటాము,” అని చెప్పారు. 



Related Post