కాంగ్రెస్ నేత కొండా సురేఖ తెరాస అధిష్టానం, తెరాస ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావును ఉద్దేశ్యించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె భర్త కొండా మురళి శనివారం ఉదయం తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన తరువాత ఆమె మీడియాతో మాట్లాడుతూ, “తెరాస విచ్చలవిడిగా డబ్బు, మద్యం పంపిణీ చేసి, అధికార దుర్వినియోగం చేసినందునే ఎన్నికల్లో గెలువగలిగింది. నా పరకాల నియోజకవర్గంలోనే తెరాస రూ.50 కోట్లు వరకు ఖర్చు చేసిందంటే ఇక మిగిలిన నియోజకవర్గాలలో ఎంత ఖర్చు చేసిందో ఊహించుకోవచ్చు.
శాసనసభ, మండలిలో గట్టిగా ప్రభుత్వాన్ని నిలదీసేవాళ్ళు సభలో అడుగుపెట్టనీయకుండా చేసి ఏకపక్షంగా పాలన సాగించడానికే కేసీఆర్ ఈవిధంగా వ్యవహరిస్తున్నారు. ఇకనైనా కేసీఆర్ తన కుటుంబ సభ్యులకు పదవులు, అధికారం కల్పించడం గురించి ఆలోచనలు చేయడం మానుకొని రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమంపై దృష్టి పెడితే బాగుంటుంది. జూపల్లి కృష్ణారావును తెరాసయే ఓడించింది. ఈసారి ఎర్రబెల్లి దయాకర్ రావుకు మంత్రిపదవి కట్టబెట్టడానికే ఆయన ఓడించబడ్డారు,” అని కొండా సురేఖ అన్నారు.
కొండా సురేఖ చెప్పినవాటిలో ఎర్రబెల్లి దయాకర్ రావుకు మంత్రిపదవి కట్టబెట్టడానికి జూపల్లి కృష్ణారావును తెరాసయే ఓడించిందనేది కొత్త విషయం. కొల్లాపూర్ నుంచి పోటీ చేసిన జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ అభ్యర్ధి బీరం హర్షవర్ధన్ రెడ్డి చేతిలో సుమారు 7,000 ఓట్లు తేడాతో ఓడిపోయారు.
తెరాసలో కూడా మంత్రిపదవులకు చాలామంది పోటీపడటం సహజమే కానీ ఒకరి కోసం పార్టీలోనే మరొకరిని ఓడించుకోవలసిన అవసరం ఉందనుకోలేము. ఒకవేళ జూపల్లి కూడా గెలిచినా ఆయనను కాదని ఎర్రబెల్లికో మరొకరికో సిఎం కెసిఆర్ మంత్రి పదవులు కట్టబెడితే పార్టీలో ఎవరూ ప్రశ్నించే సాహసం చేయలేరని అందరికీ తెలుసు. పైగా రాష్ట్రంలో తెరాసకు ప్రత్యామ్నాయమే లేదు కనుక ఈ పరిస్థితులలో పార్టీలో ఎవరూ కేసీఆర్ నిర్ణయాన్ని ప్రశ్నించలేరు... ప్రశ్నించి బయటకు వెళ్లాలనుకోరు కదా. కనుక జూపల్లి ఓటమి విషయంలో కొండా సురేఖ వాదన నమ్మశక్యంగా లేదు.