టీజెఎస్‌ ఏమిచేయబోతోంది?

December 22, 2018


img

ప్రజాకూటమితో కలిసి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పోటీకి దిగిన తెలంగాణ జనసమితి (టీజెఎస్‌) తమకు రాష్ట్రంలో కనీసం 25 స్థానాలలో మంచి బలముందని గట్టిగా నమ్మింది. కనుకనే తమకు కనీసం 14 స్థానాలు కేటాయించాలని చివరివరకు గట్టిగా పట్టుబట్టింది. కానీ తమకు కేటాయించబడిన 8 స్థానాలలో ఒక్కటి కూడా గెలుచుకోలేకపోయింది. టీజెఎస్‌ అభ్యర్ధుల ఓటమికి అనేక కారణాలు ఉండవచ్చు కానీ అవన్నీ ఇప్పుడు అప్రస్తుతం. ఇకపై టీజెఎస్‌ ఏమి చేయబోతోందని మాత్రమే ముఖ్యం. 

టీజెఎస్‌ ముందు మూడు మార్గాలున్నాయి. 1. పంచాయతీ ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేసి తమ బలాన్ని మరోసారి పరీక్షించుకోవడం. 2. మళ్ళీ కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేసి అదృష్టం పరీక్షించుకోవడం. 3. పార్టీని రద్దు చేయడం. 

వీటిలో మొదటి ఆప్షన్ టీజెఎస్‌కు సరిపడకపోవచ్చు. ఎందుకంటే, దానికి నిజంగానే ప్రజాధారణ, బలం ఉన్నట్లయితే అసెంబ్లీ ఎన్నికలలోనే అది రుజువయ్యేది. టీజెఎస్‌కు బలం, ప్రజాధారణ లేవు కనుక పంచాయతీ, లోక్‌సభ ఎన్నికలలో మళ్ళీ దానిని కలుపుకుపోయేందుకు కాంగ్రెస్ పార్టీ సైతం నిరాకరించవచ్చు. కనుక ఇక దానికి మిగిలింది మూడవ ఆప్షన్ మాత్రమే. అయితే ఇప్పుడే ఈవిధంగా ఊహించడం తొందరపాటే కావచ్చు. కానీ కొమ్ములు తిరిగిన నేతలున్న జాతీయపార్టీ అయిన కాంగ్రెస్ పార్టీయే తెరాస ధాటిని తట్టుకోలేక తన ఉనికిని కోల్పోయే పరిస్థితులలో ఉన్నప్పుడు, కోదండరామ్‌ తప్ప మరెవరూ బలమైన నేతలు లేని తెలంగాణ జనసమితి మరో ఐదేళ్ళపాటు తెరాసను తట్టుకొని నిలబడగలదనుకోవడం అత్యశే అవుతుంది. కనుక ఇప్పటికిప్పుడు కాకపోయినా ఏదో ఒకరోజు టీజెఎస్‌ మూడో ఆప్షన్ ఎంచుకోక తప్పదేమో?


Related Post