ఇక ఎన్నికలెందుకు...పోటీలు ఎందుకు?

December 22, 2018


img

అసెంబ్లీ ఎన్నికలు ముగిసి ఇంకా పూర్తిస్థాయి ప్రభుత్వం ఏర్పడక మునుపే, శాసనసభ,మండలి సమావేశాలు మొదలవక మునుపే అప్పుడే పార్టీ ఫిరాయింపులు మొదలైపోయాయి. నలుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్సీలు తెరాసలో చేరిపోయారు. త్వరలో ఇద్దరు టిడిపి ఎమ్మెల్యేలు, 6-8 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కూడా తెరాసలో చేరేందుకు తెర వెనుక చర్చలు జరుగుతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అంటే చట్టసభలలో ప్రతిపక్షపార్టీలు లేకుండా ఏకపక్షంగా మారే అవకాశాలున్నాయన్న మాట. 

ఎన్నికల సమయంలో అధికార, ప్రతిపక్షపార్టీలు ఒకదానిపై మరొకటి తీవ్ర విమర్శలు చేసుకొంటాయి. కానీ ఎన్నికలైన తరువాత ఓడిన పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను అధికారపార్టీలోకి చేర్చుకోవడం ఇప్పుడు ఒక ఆనవాయితీగా మారిపోయింది. అంటే బజారులో రెడీమేడ్-చొక్కాలు లభించినట్లుగా అధికారపార్టీకి ఏ కష్టం లేకుండా ‘రెడీమేడ్ ఎమ్మెల్యేలు’ కూడా లభిస్తున్నారన్న మాట. ఈ పార్టీ ఫిరాయింపులకు ‘రాష్ట్రాభివృద్ధి కోసమే’ అనే అందమైన ముసుగు వేస్తున్నప్పటికీ  రాష్ట్రంలో ప్రతిపక్షపార్టీలను బలహీనపరచడానికేనని అందరికీ తెలుసు. 

అలాగే ఎన్నికల సమయంలో నాలుగేళ్ల తెరాస పాలనపై విమర్శలు గుప్పించిన ప్రతిపక్ష నేతలు, ఇప్పుడు అదే తెరాసలో చేరడానికి సిద్దపడుతున్నారు. అంటే అధికార, ప్రతిపక్ష పార్టీలు రెంటికీ ప్రజల అభిప్రాయాల పట్ల ఏమాత్రం గౌరవం లేదని అర్ధమవుతోంది. నేతి బీరకాయలో నెయ్యి ఉండనట్లే మన ప్రజాస్వామ్యంలో నైతికవిలువలు ఉండవని ఈ ఫిరాయింపులు మరోసారి నిరూపిస్తున్నాయి. 

ప్రజలు ఏ పార్టీకి ఓటేసినా చివరికి అందరూ అధికార పార్టీలోనే చేరిపోతున్నప్పుడు ఈ మాత్రం దానికి ఎన్నికలు ఎందుకు? అనిపించకమానదు. ప్రతీ ఐదేళ్ళకు ఓసారి వేలకోట్లు ప్రజాధనం ఖర్చు చేసి ఎన్నికలు నిర్వహించడం, వాటిలో పోటీపడే పార్టీలు, అభ్యర్ధులు వందలకోట్లు ఖర్చు చేయడం, ఆ ఎన్నికల నిర్వహణకు వేలాదిమంది ప్రభుత్వోద్యోగులు రేయింబవళ్ళు పనిచేయడం, లక్షలాదిమంది పోలీసులు, భద్రతాదళాలు పహారాకాయడం ఇవన్నీ వృదానే కదా?

ప్రజలకు ఎవరు పాలించినా పరువాలేదు కానీ తమ రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందాలని కోరుకొంటారు అంతే! కనుక ప్రతిపక్షపార్టీలు వద్దనుకొన్నప్పుడు అధికార, ప్రతిపక్షపార్టీల నేతలందరూ కలిసి మళ్ళీ రాచరిక వ్యవస్థను ఏర్పాటుచేసుకొని ఈ ఎన్నికలను, చట్టసభలను రద్దు చేసుకొంటే కనీసం ఈ ఎన్నికల దుబారా ఖర్చునైనా అరికట్టవచ్చు కదా! మనది ప్రజాస్వామ్యదేశమని చాలా గొప్పగా, గర్వంగా చెప్పుకొంటున్నప్పటికీ జరుగుతున్న ఈ పరిణామాలన్నీ మళ్ళీ రాజరిక వ్యవస్థ ఏర్పాటు దిశలోనే సాగుతున్నాయని చెప్పక తప్పదు. 


Related Post