ఎమ్మెల్సీల బాటలోనే ఎమ్మెల్యేలు కూడా?

December 22, 2018


img

అసెంబ్లీ ఎన్నికలలో ఘోరపరాజయం పొందిన కాంగ్రెస్ పార్టీకి ఆ షాక్ నుంచి ఇంకా పూర్తిగా తేరుకోక మునుపే వరుసగా ఇంకా షాకులు తగులుతున్నాయి. నలుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్సీలను తెరాసలో విలీనం చేసుకొంది. కొందరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కూడా వారి బాటలోనే నడిచి తెరాసలో చేరబోతున్నారంటూ జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వారికంటే ముందు ఖమ్మం జిల్లాలో తెరాస అభ్యర్ధులను ఓడించిన టిడిపి ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య (సత్తుపల్లి), మెచ్చా నాగేశ్వరరావు (అశ్వారావుపేట) తెరాసలో చేరేందుకు సిద్దం అవుతున్నట్లు తాజా సమాచారం. 

వారిరువురూ శుక్రవారం ఒక టిడిపి నేత ఇంట్లో తమతమ నియోజకవర్గంలోని ముఖ్యనేతలతో రహస్యంగా సమావేశమయ్యి తెరాసలో చేరడం గురించి చర్చించారు. తమకు తెరాసలో చేరవలసిందిగా ఆహ్వానం వచ్చిందని తెలియజేయగా ప్రస్తుత పరిస్థితులలో తెరాసలోకి వెళ్ళడమే అందరికీ మంచిదని ముఖ్యనేతల అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. ఈ విషయం మీడియాకు తెలియడంతో ఎమ్మెల్యేలు వెంకటవీరయ్య, నాగేశ్వరరావు తాము పార్టీ మారడం లేదని, మీడియాలో వస్తున్న ఊహాగానాలు నిజం కావని ఖండించారు. కానీ రెండుమూడు రోజులలోనే వారిద్దరూ లేదా ఒకరు తప్పకుండా పార్టీ మారే అవకాశం ఉన్నట్లు సమాచారం. అదే జరిగితే ఆ రెండు నియోజకవర్గాలలో తెరాస ఓడినా గెలిచినట్లే అవుతుంది. 

ఒకవేళ వారిరువురూ తెరాసలో చేరిపోతే కాంగ్రెస్ పార్టీకి కూడా ఇబ్బంది ఏర్పడుతుంది. కాంగ్రెస్ ఎమ్మెల్సీలు షబీర్ ఆలీ, పొంగులేటి సుధాకర్ పదవీకాలం మార్చి నెలాఖరుకు ముగుస్తుంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి 19 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. కనీసం 20 మంది ఎమ్మెల్యేలు మద్దతు ఉంటేనే ఎమ్మెల్యేల కోటాలో కాంగ్రెస్ పార్టీకి ఒక ఎమ్మెల్సీ పదవి లభిస్తుంది. ఒకవేళ కాంగ్రెస్‌ లేదా టిడిపిలలో ఇద్దరు ఎమ్మెల్యేలు తగ్గినా ఇక కాంగ్రెస్‌ పార్టీకి ఆ ఒక్క ఎమ్మెల్సీ పదవి కూడా లభించదు. కనుక టిడిపి ఎమ్మెల్యేలు ఫిరాయించినా కాంగ్రెస్ పార్టీకే నష్టం. కానీ 7-8 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఫిరాయించబోతున్నారని మీడియాలో వస్తున్న ఊహాగానాలే నిజమైతే, కాంగ్రెస్ పార్టీకి శాసనసభలో కూడా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడవచ్చు.


Related Post