నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్సీలు ఆకుల లలిత, సంతోష్ కుమార్, దామోదర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి తెరాసలో విలీనమైన తరువాత మీడియాతో మాట్లాడుతూ తెరాసలో చేరడానికి గల కారణాలను వివరించారు.
ఎమ్మెల్సీ ఆకుల లలిత మాట్లాడుతూ “రాష్ట్ర ప్రజలందరూ తెరాసవైపే ఉన్నారని అసెంబ్లీ ఎన్నికలలో స్పష్టం అయ్యింది. మేము కూడా ప్రజలవైపే ఉండాలనుకొన్నాము అందుకే తెరాసలో చేరిపోయాము. త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికలలో తెరాస మద్దతు ఇస్తున్న అభ్యర్ధుల గెలుపుకోసం గట్టిగా కృషి చేస్తాము ,” అని అన్నారు.
ఎమ్మెల్సీ సంతోష్ మాట్లాడుతూ, “రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో సమర్ధమైన నాయకత్వం లేదు. అందుకే బలమైన నాయకత్వం ఉన్న తెరాసలో చేరాము. ఎన్నికలలో టిడిపితో పొత్తు పెట్టుకోవాలనుకొంటున్నప్పుడు పార్టీలో మాకెవరికీ చెప్పనేలేదు. పార్టీలో మావంటివారికి విలువేలేదని అర్ధమైంది. అందుకే పార్టీని వీడి తెరాసలో చేరుతున్నాము. టిడిపితో పొత్తు పెట్టుకోవడం వలననే కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది,” అని అన్నారు.
దామోదర్ రెడ్డి మాట్లాడుతూ, “రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలు మొదటి నుంచి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ పార్టీ కోసం పనిచేస్తున్న మావంటి నేతల పట్ల, కార్యకర్తల పట్ల చాలా అవమానకరంగా వ్యవహరించారు. రాష్ట్ర కాంగ్రెస్ అధిష్టానం వైఖరి కారణంగానే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ దెబ్బతింది. తెరాస వలననే రాష్ట్రాభివృద్ధి సాధ్యపడుతుందని భావించినందునే తెరాసలో చేరాము. తెరాసలో మాకు సముచిత గౌరవం లభిస్తుందని ఆశిస్తున్నాము,” అని చెప్పారు.