అవును..కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్సీలలో నలుగురు తమను తెరాసలో విలీనం చేయాలని మండలి ఛైర్మన్ స్వామిగౌడ్‌ను కోరబోతున్నారు. ఎమ్మెల్సీలు దామోదర్‌రెడ్డి, ప్రభాకర్, ఆకుల లలిత, సంతోష్ కుమార్‌లలో ఇప్పటికే ప్రభాకర్‌రావు, దామోదర్‌రెడ్డి తెరాసలో చేరారు. ఇప్పుడు ఆకుల లలిత, సంతోష్ కుమార్ కూడా వారిబాటలోనే నడువబోతున్నారు. వారు నలుగురు నేడోరేపో మండలి ఛైర్మన్ స్వామిగౌడ్‌ను కలిసి కాంగ్రెస్ శాసనమండలి పక్షాన్ని తెరాసలో విలీనం చేయాలని కోరబోతున్నట్లు తాజా సమాచారం.
కాంగ్రెస్ పార్టీకి మొత్తం ఏడుగురు ఎమ్మెల్సీలు ఉండేవారు. వారిలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇటీవల మునుగోడు నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన తరువాత తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడు నలుగురు ఎమ్మెల్సీలు తెరాసలో చేరిపోతే ఇక పొంగులేటి సుధాకర్‌రెడ్డి షబ్బీర్ ఆలీ మాత్రమే మిగిలి ఉంటారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీగా ఉన్న శాసనమండలిలో ప్రతిపక్షహోదా పొందాలంటే కనీసం నలుగురు ఎమ్మెల్సీలు ఉండాలి. కనుక కాంగ్రెస్ పార్టీకి మండలిలో ప్రతిపక్షహోదా కోల్పోవడం ఖాయంగానే కనిపిస్తోంది.
షబ్బీర్, పొంగులేటిల పదవీకాలం 2019 మార్చితో ముగియబోతోంది. కనుక కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఆ మూడు స్థానాలను దక్కించుకోలేకపోతే శాసనమండలిలో దానికి ప్రాతినిధ్యం ఉండకపోవచ్చు. గత ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ శాసనసభలో కాంగ్రెస్ పార్టీకి ఎదురైన దుస్థితే ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి శాసనమండలిలో ఎదురవుతుండటం విశేషం.