తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఘోరపరాజయం పొందడం జీర్ణించుకోలేక పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి డిసెంబరు 11న ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి నేటి వరకు మీడియా ముందుకు రాలేదు. ఆయనే కాదు…కోమటిరెడ్డి వెంకటరెడ్డి, డికె.అరుణ, దామోదర రాజనర్సింహ వంటి అనేకమంది సీనియర్ కాంగ్రెస్ నేతలు, టీజెఎస్ అధ్యక్షుడు కోదండరామ్, టిడిపి అధ్యక్షుడు ఎల్ రమణ తదితరులు ఇంకా బయటకు రాలేదు.
ఒకవేళ ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలిచి ఉంటే, పార్టీని విజయపధంలో నడిపించి ఆధికారం సంపాదించిపెట్టినందుకు ఆ క్రెడిట్ తప్పకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డికే లభిస్తుంది కనుక ఈ ఓటమికి కూడా ఆయనే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది.
ఈ గెలుపోటములు సంగతి ఎలా ఉన్నప్పటికీ ఇటువంటి పరిస్థితులలో అందరి కంటే ముందుగా ఆయనే కోలుకొని పార్టీ శ్రేణులకు ధైర్యం చెప్పాల్సిన అవసరం చాలా ఉంది. అదీగాక త్వరలోనే పంచాయతీ ఎన్నికలు...ఆ తరువాత లోక్‌సభ ఎన్నికలు రాబోతున్నాయి. కనుక వాటిని ఎదుర్కొనేందుకు మళ్ళీ పార్టీని సిద్దం చేయాల్సిన బాధ్యత ఆయనపైనే ఉంటుంది. అయితే కాంగ్రెస్ ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానని శపధం చేసి ఉన్నందున ఉత్తమ్ కుమార్ రెడ్డి చాలా ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నారని భావించవచ్చు.
ఇక ఆయన అజ్ఞావాసానికి మరో కారణం కూడా కనిపిస్తోంది. కాంగ్రెస్ అధిష్టానం ఆయనను పిసిసి అధ్యక్షుడిగా కొనసాగిస్తుందా లేక ఆయన చేత రాజీనామా చేయించి మరో నేతకు అవకాశం కల్పిస్తుందో తెలియాల్సి ఉంది. బహుశః అందుకే ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ అధిష్టానం నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారేమో?