ఈసారి మహాకూటమి వంతా?

December 20, 2018


img

వచ్చే ఏడాది జరుగబోయే లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్‌ నేతృత్వంలో బిజెపిని వ్యతిరేకించే పార్టీలతో కలిసి మహాకూటమి ఏర్పాటుకు జోరుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాంగ్రెస్‌ నేతలు, చంద్రబాబునాయుడు, మమతా బెనర్జీ, అఖిలేశ్ యాదవ్, స్టాలిన్, దేవగౌడ తదితరులు దీనికోసం సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల చెన్నైలో కరుణానిది విగ్రహావిష్కరణ కార్యక్రమానికి వీరిలో చాలా మంది హాజరయ్యి తమ ఐక్యతను చాటారు. అంతవరకు బాగానే ఉంది. కానీ ఆ కార్యక్రమంలో డిఎంకె అధినేత స్టాలిన్ మాట్లాడుతూ “రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడానికి అన్ని విధాలా అర్హుడు. ఆయనకు మా పార్టీ పూర్తి మద్దతు ఉంటుంది,” అంటూ మాట్లాడిన మాటలపై అప్పుడే మహాకూటమిలో అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. 

యూపికి చెందిన సమాజ్ వాదీ పార్టీ అధినేత, ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ స్టాలిన్ వ్యాఖ్యలపై స్పందిస్తూ, “అది ఆయన వ్యక్తిగత అభిప్రాయంగానే భావించాలి తప్ప మహాకూటమి అభిప్రాయంగా భావించరాదు,” అని అన్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందిస్తూ, “ఇది ప్రధానమంత్రి అభ్యర్ధి గురించి మాటాడుకోవలసిన సమయం కాదు. కూటమిలో అన్ని పార్టీలు కలిసి మాట్లాడుకొని నిర్ణయించుకోవలసి ఉంది. అయితే దీనిపై మేము మంచి నిర్ణయమే తీసుకోగలమనే నమ్మకం నాకుంది,” అని అన్నారు. అంటే ఆమెకు కూడా రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా తమకు ఆమోదం కాదని చెప్పినట్లే భావించవచ్చు. ఇంకా నేషనల్‌ కాన్ఫరెన్స్‌ (జమ్మూకశ్మీర్‌)‌, ఆర్‌జేడీ (బీహార్), సీపీఎం పార్టీల నేతలు కూడా ఇంచుమించు ఇటువంటి అభిప్రాయాలే వ్యక్తం చేశారు. 

అంటే వారందరూ రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా ఆమోదించడం లేదని కాదు...వారందరికీ ప్రధానమంత్రి పదవిపై ఆశలున్నాయని దానార్ధం. మమతా బెనర్జీ, శరత్ పవార్, మాయావతీ, ములాయం సింగ్, లాలూ ప్రసాద్ యాదవ్ (ప్రస్తుతం జైల్లో ఉన్నారు), నితీశ్ కుమార్ వంటి అరడజనుకుపైగా నేతలకు జీవితంలో ఒక్కసారైనా ప్రధానమంత్రి కుర్చీలో కూర్చోవాలని కోరిక. కనుకనే అందరూ స్టాలిన్ అభిప్రాయాన్ని ఖండించారు. 

గతంలో కూడా ప్రధానమంత్రి అభ్యర్ధి విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోవడం వలననే కూటమి ప్రయోగాలు విఫలం అయ్యాయి. మళ్ళీ ఇప్పుడూ అదే జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్‌ నేతృత్వంలో నాలుగు పార్టీలు కలిసి చేసిన ప్రజాకూటమి ముందుగా ముఖ్యమంత్రి అభ్యర్ధిని ప్రకటించలేని దుస్థితిలో ఎన్నికలకు వెళ్ళడంతో ప్రజలకు దానిపై నమ్మకం ఏర్పడలేదు. సరైన యుద్దవ్యూహాలు, సుశిక్షితులైన సైన్యం, దానిని నడిపించే బలమైన నాయకుడు లేకుండా ఎన్నికల కురుక్షేత్రంలో దిగినందునే ప్రజాకూటమి ఓడిపోయిందని అందరికీ తెలుసు. కనుక లోక్‌సభ ఎన్నికలలో మళ్ళీ అదేవిధంగా ముందుకు సాగాలనుకొంటున్న మహాకూటమికి తెలంగాణలో ప్రజాకూటమికి ఎదురైన చేదు అనుభవమే పునరావృతం కావచ్చు. 


Related Post