అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోయిన సీనియర్ కాంగ్రెస్ నేత షబ్బీర్ ఆలీ బుదవారం మీడియాతో మాట్లాడుతూ, “ఫిరాయింపులపై తెరాస ద్వందవైఖరి అవలంభిస్తోంది. టిడిపి ఎమ్మెల్యేగా ఎన్నికైన తలసాని యాదవ్ తెరాసలో చేరి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకపోగా నాలుగేళ్ళపాటు మంత్రిగా కూడా కొనసాగారు. అలాగే తెరాసలో చేరిన కాంగ్రెస్, టిడిపి ఎమ్మెల్యేలపై అనర్హత వేటువేయాలని మేము ఎన్నిసార్లు స్పీకర్, మండలి చైర్మన్‌ను కోరినా పట్టించుకోలేదు.
ఇటీవల కాంగ్రెస్ తరపున పోటీ చేసి గెలిచిన ఎమ్మెల్యే దామోదర్ రెడ్డి తెరాసలో చేరారు. ఆయనకు సంబందించి పూర్తి వివరాలు మండలి ఛైర్మన్ కు అందజేసినా ఇంతవరకు ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కానీ తెరాసలో నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ముగ్గురు ఎమ్మెల్సీలకు అప్పుడే నోటీసులు పంపించారు. తెరాస ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర పార్టీలలోకి వెళితే వెంటనే చర్యలకు ఉపక్రమిస్తున్నప్పుడు, ఇతర పార్టీల నుంచి తెరాసలో చేరినవారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఫిరాయింపుల విషయంలో తెరాసది ద్వందనీతి అవలంభిస్తూ, మళ్ళీ నీతులు వల్లిస్తుండటం హాస్యాస్పదంగా ఉంది,” అని షబ్బీర్ అలీ అన్నారు.