బాబు కారణంగానే ప్రజాకూటమి ఓటమి: తమ్మినేని

December 19, 2018


img

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో తెరాసకు చాలా గట్టి పోటీ నిచ్చిన ప్రజాకూటమి విజయం సాధించలేకపోయినా కనీసం గౌరవప్రదమైన సీట్లు కూడా సంపాదించుకోలేకపోవడం రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరిచింది. ప్రజాకూటమి ఓటమికి ఒక్కొక్కరూ ఒక్కో కొత్త కారణం చెపుతున్నారు. అయితే చంద్రబాబునాయుడు విషయంలో అందరూ ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తుండటం విశేషం. ఆయన ఎన్నికల ప్రచారానికి రావడంతో తెరాస వాదనలకు బలం చేకూర్చినట్లయిందని కనుక ఆయన ‘ఎంట్రీ’ కారణంగానే ప్రజాకూటమి ఓడిపోయిందని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వారితో ఏకీభవిస్తూ, “ఒకవేళ ఎన్నికల ప్రచారానికి రాకపోయుంటే ప్రజాకూటమి పరిస్థితి ఏవిధంగా ఉండేదో కానీ ఆయన రాకతో ఒక్కసారిగా ప్రజాకూటమి పట్ల ప్రజలలో వ్యతిరేకత పెరిగి అది తెరాసకు అనుకూలంగా మారింది. చంద్రబాబుపై వ్యతిరేకత ప్రజాకూటమికి శాపంగా మారింది. కనుక ఇకనైనా ప్రజాకూటమిలో మిగిలిన మూడు పార్టీలు పునరాలోచించుకొని మాతో కలిసివస్తే మంచిది,” అని అన్నారు. 

నిజానికి తెరాస చంద్రబాబునాయుడును లక్ష్యంగా చేసుకొని ఎన్నికల వ్యూహం రూపొందించుకొన్నప్పుడే ప్రజాకూటమి మేల్కొని దాని వలన జరుగబోయే నష్టాన్ని ముందుగా అంచనా వేసుకొని దానికి తగిన ప్రతివ్యూహం అమలుచేసి ఉండాల్సింది. కానీ సీట్ల సర్దుబాట్లపై చర్చలతోనే పుణ్యకాలం కాస్తా వృధా చేసుకొన్నాయి. మిగిలిన 15 రోజులలో ప్రజాకూటమి ఎంతగట్టిగా ఎన్నికల ప్రచారం చేసినప్పటికీ, ‘చంద్రబాబు గురించి తెరాస చేసిన వాదనలు తప్పు’ అని ప్రజలను ఒప్పించలేకపోయాయి. 

పైగా ప్రజాకూటమి గెలిస్తే ముఖ్యమంత్రి ఎవరు? ఎన్ని రోజులు ఆ పదవిలో ఉంటారు?అనే తెరాస ప్రశ్నలకు ప్రజాకూటమి సంతృప్తికరమైన సమాధానం చెప్పలేకపోవడంతో ఆ విషయంలో కూడా తెరాస వాదనలు నిజమని అంగీకరించినట్లయింది. కారణాలు ఏవైతేనేమీ ప్రజాకూటమి ప్రయోగం బెడిసికొట్టింది కనుక పంచాయతీ, లోక్‌సభ ఎన్నికలలో మళ్ళీ మరోసారి ప్రయోగం చేస్తారో లేదో చూడాలి.


Related Post