రూ.60,875 కోట్లు ఎవరు తిన్నట్లు?

December 19, 2018


img

కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వంలో అవినీతి, అక్రమాలు జరిగితే ప్రతిపక్ష పార్టీలు ఊరూవాడా తిరిగి వాటి గురించి ప్రచారం చేస్తుంటాయి. కానీ దేశంలో ప్రభుత్వరంగ బ్యాంకులలో ప్రతీ ఏడాది వేలకోట్లు మొండి బకాయిలుగా రాసుకొని రద్దు చేస్తుంటే వాటి గురించి ప్రతిపక్షపార్టీలు కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. 

ఉదాహరణకు ఐడిబిఐ (ఇండస్ట్రియల్ డెవెలప్మెంట్) బ్యాంకు ఈ ఆర్ధిక సంవత్సరంలో తొలి ప్రధమార్ధంలోనే రూ.9,052 కోట్లు మొండి బకాయిలను రద్దు చేసినట్లు ఆర్థిక ‍వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీకి తెలియజేసింది. ఇక ఇదే ఆర్ధిక సంవత్సరంలో రెండో త్రైమాసం ముగిసేసరికి రూ.60,875 కోట్లు నిరర్ధక ఆస్తులు మిగిలిపోయాయని తాజా సమాచారం. కనుక వాటిని కూడా మొండి బకాయిలుగా వ్రాసుకొని రద్దు చేయబోతోంది. 

2015-16 ఆర్ధిక సంవత్సరంలో ఈ మొండి బకాయిలు 7.79 శాతం ఉండగా అవి ఈ ఆర్ధిక సంవత్సరంలో 11.8 శాతానికి పెరిగినట్లు బ్యాంక్ స్వయంగా పేర్కొంది. ఈ ఆర్ధిక సంవత్సరంలో మంజూరు చేసిన రుణాలలో 31 శాతం మొండి బకాయిలుగా మిగిలిపోయాయని ఐడిబిఐ పేర్కొంది. రిజర్వ్ బ్యాంక్ సూచించినట్లుగా ‘అసెట్ క్వాలిటీ రివ్యూ’ పద్దతిలో నిరర్ధక ఆస్తులను గుర్తించి వాటికి సంబందించిన రుణాలను రద్దు చేస్తున్నట్లు ఐడిబిఐ పేర్కొంది. 

ఈ రూ.60,875 కోట్లు కేవలం ఒక్క ఐడిబిఐ బ్యాంకు రద్దు చేసిన మొండి బకాయిలు మాత్రమే. ఇక మిగిలిన ప్రభుత్వరంగ బ్యాంకులలో ఎన్ని వేల కోట్లు మొండి బకాయిలను రద్దు చేస్తున్నారో ఊహించడం అసాధ్యం. 

సామాన్య ప్రజలు చిన్న ఇల్లు కొనుక్కోవడానికో లేక పిల్లల చదువులకో కొద్దిపాటి రుణాలు కోసం అడిగితే బ్యాంకులు సవాలక్ష ప్రశ్నలు వేసి, అనేక ష్యూరిటీలు పెట్టించుకొంటాయి. అప్పటి నుంచి క్రమం తప్పకుండా వారి దగ్గర నుండి అసలు, వడ్డీ ఖరాఖండీగా వసూలు చేసుకొంటాయి. కానీ కాంట్రాక్టర్ ముసుగులో వచ్చే రాజకీయనాయకులకు, వారి సంస్థలకు, కార్పొరేట్ కంపెనీలకు ఈవిధంగా “తిరిగి చెల్లించనవసరంలేని రుణాలు” ఉదారంగా ఇస్తుండటం, వాటిని మొండిబకాయిలుగా వ్రాసుకొని రద్దు చేసుకొనేందుకు రిజర్వ్ బ్యాంక్ అనుమతిస్తుండటం...చాలా దిగ్భ్రాంతి కలిగిస్తుంది. 

బ్యాంకులు రద్దు చేస్తున్న ఈ వేలకోట్ల మొండి బకాయిలను మళ్ళీ కేంద్ర ప్రభుత్వమే ఏదోరూపంలో భర్తీ చేస్తుంటుంది. అంటే దేశప్రజలు కష్టార్జితంతో కట్టిన పన్నులు ఈవిధంగా కొందరు రుణాల పేరుతో గుట్టుగా మేసేస్తున్నారని అర్ధం అవుతోంది. దశాబ్ధాలుగా ఈ రుణాల పంపిణీ పేరుతో జరుగుతున్న ఈ ఎగవేతలు...దోపిడీని ఎవరూ నిలదీసి అడగకపోవడం, వాటిని అరికట్టడంలో అటు ప్రభుత్వాలు, ఇటు ప్రతిపక్షపార్టీలు కూడా తీవ్ర అలసత్వం ప్రదర్శిస్తుండటం చేత యావత్ భారతీయులు తమకు తెలియకుండానే వాటికి మూల్యం చెల్లిస్తున్నారు. ఈ దోపిడీ ఎప్పటికైనా ఆగుతుందనే నమ్మకం కూడా లేదు. ఎందుకంటే దీనిని ప్రశ్నించి అడ్డుకొనేవారే లేరు కనుక.


Related Post