కేటిఆర్‌ను పార్టీకే పరిమితం చేస్తారా?

December 18, 2018


img

తెరాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నియమితులైన సిరిసిల్ల ఎమ్మెల్యే కేటిఆర్‌ సోమవారం ఉదయం 11.56 గంటలకు తెలంగాణభవన్‌లో బాధ్యతలు స్వీకరించారు. సోమవారం ఉదయం నగరంలోని బసవతారకం ఆసుపత్రి నుంచి సుమారు 20,000 మంది కార్యకర్తలతో కలిసి బారీ ఊరేగింపుగా బయలుదేరి తెలంగాణభవన్‌ చేరుకొన్నారు. పార్టీ కార్యాలయం వద్ద ఆయనకు పార్టీ నేతలు, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఘనస్వాగతం పలికారు.

తెరాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టిన అనంతరం కేటిఆర్‌ వారిని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, త్వరలో జరుగబోయే స్థానికసంస్థల, లోక్‌సభ ఎన్నికలలో పార్టీని భారీ మెజార్టీతో గెలిపించుకోవడమే తన లక్ష్యమని అన్నారు. ఆ తరువాత రాష్ట్రంలో పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేసి వచ్చే ఎన్నికల నాటికి తిరుగులేని శక్తిగా నిలిపేందుకు గట్టిగా కృషి చేస్తానని అన్నారు. కేసీఆర్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా, పార్టీ నేతలు ఆయనకు అభినందనలు తెలియజేశారు. 

కేటిఆర్‌ను వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నియమిస్తున్నప్పుడు ఆయన పార్టీకి, ప్రభుత్వానికి మద్య అనుసంధానకర్తగా పనిచేస్తారని సిఎం కేసీఆర్‌ అన్నారు. కానీ కేటిఆర్‌ వంటి సమర్ధుడైన వ్యక్తికి ఎటువంటి మంత్రిపదవులు ఇవ్వకుండా పార్టీకే పరిమితం చేస్తే తెరాసకే నష్టం. 

లోక్‌సభ ఎన్నికల తరువాత సిఎం కేసీఆర్‌ జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టాలనుకొంటున్నారు కనుక అప్పుడు జాతీయస్థాయిలో రాజకీయపరిస్థితులు, కాంగ్రెస్‌, బిజెపిల బలాబలాలు అన్నిటినీ బేరీజువేసుకొని ఒకవేళ అన్ని అనుకూలంగా ఉన్నట్లయితే, అప్పుడు కేటిఆర్‌కు ముఖ్యమంత్రి బాధ్యతలు కూడా అప్పజెప్పవచ్చనే ఆలోచనతోనే కేసీఆర్‌ ఆయనకు ప్రస్తుతానికి పార్టీ బాధ్యతలు అప్పగించి ఉండవచ్చు. ఒకవేళ నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు సాధ్యపడని పక్షంలో కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా కొనసాగుతూ కేటిఆర్‌కు ప్రభుత్వంలో కీలకపదవులు అప్పగించవచ్చు. 


Related Post