మా ఓటమికి కారణాలు అవే: జానారెడ్డి

December 18, 2018


img

ఈసారి అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తప్పకుండా గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నామని గట్టిగా నమ్మిన జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్‌రెడ్డి, డికె.అరుణ వంటి హేమాహేమీలు సైతం ఓడిపోవడంతో కంగుతిన్నారు. కాంగ్రెస్‌ ఓటమికి ‘అసలు కారణాలను’ పార్టీలో అంతర్గతంగా విశ్లేషించుకొని తెలుసుకొనే ప్రయత్నాలు చేస్తూనే, కొందరు సీనియర్ నేతలు తమ ఓటమికి గల కారణాలను వెల్లడిస్తున్నారు. 

ఈవీఎంల ట్యాంపరింగ్ కారణంగానే కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందని భట్టి విక్రమార్క, దాసోజు శ్రవణ్ తదితరులు ఆరోపించగా, నాగార్జున సాగర్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన సీనియర్ కాంగ్రెస్ నేత జానారెడ్డి నిన్న మీడియాతో మాట్లాడుతూ, “ఈ ఎన్నికలలో తెరాస విచ్చల విడిగా డబ్బు, మద్యం పంపిణీ చేయడం వలననే ప్రజాకూటమి ఓడిపోయింది. ప్రజలను ప్రలోభపెట్టి ఎన్నికలలో గెలిచి అధికారం చేజిక్కించుకోవడం సిగ్గుచేటు. ప్రజలు నిజంగా తమవైపే ఉన్నారని తెరాస నమ్ముతున్నట్లయితే ఇంత విచ్చలవిడిగా డబ్బు, మద్యం ఎందుకు పంచవలసి వచ్చింది? తెరాస ఏవిధంగా గెలిచినప్పటికీ ప్రజాతీర్పును గౌరవించవలసిందే. కనుక ఈ ఓటమికి క్రుంగిపోకుండా కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు మళ్ళీ కలిసికట్టుగా పనిచేసి త్వరలో జరుగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు, లోక్‌సభ ఎన్నికలకు సిద్దం కావాలి,” అని అన్నారు. 


Related Post