మంత్రివర్గం ఏర్పాటులో ఆలస్యం అందుకేనా?

December 18, 2018


img

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో తెరాస ఘనవిజయం సాధించిన తరువాత డిసెంబరు 13న కేసీఆర్‌, మహమూద్ ఆలీ ముఖ్యమంత్రి, హోంమంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. నాలుగైదు రోజులలో కొత్త మంత్రివర్గం ఏర్పాటు చేస్తానని సిఎం కేసీఆర్‌ చెప్పారు. కానీ ఇంతవరకు అటువంటి సూచనలు ఏవీ కనబడటం లేదు. అయితే తెరాస పూర్తి మెజార్టీతో అధికారంలోకి వచ్చినా మంత్రివర్గం ఏర్పాటుకు సిఎం కేసీఆర్‌ ఇంకా ఎందుకు ఇంత ఆలస్యం చేస్తున్నారు? అంటే రెండు కారణాలు వినబడుతున్నాయి.

కాంగ్రెస్ పార్టీలో గెలిచిన కొంతమంది సీనియర్ నేతలు తెరాసలో చేరేందుకు సంప్రదింపులు జరుపుతున్నారని, వారిలో ఒకరిద్దరికి మంత్రి పదవులు ఇవ్వవలసి ఉంటుంది కనుకనే మంత్రివర్గం ఏర్పాటులో ఆలస్యం జరుగుతున్నట్లు సమాచారం. గత ఐదేళ్ళుగా ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మరో ఐదేళ్ళుగా ప్రతిపక్ష బెంచీలలో కూర్చోక తప్పదు. 2022 ఎన్నికల నాటికి రాష్ట్రంలో తెరాస మరింత బలపడుతుంది కనుక ఆ ఎన్నికలలోనైనా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందో రాదో తెలియదు. కనుక రాష్ట్రంలో కాంగ్రెస్ భవిష్యత్ అగమ్యగోచరంగా ఉంది కనుక కొంతమంది ఎమ్మెల్యేలు తప్పకుండా తెరాసలో చేరే అవకాశాలున్నాయి.   

ఇక మరోకారణం ఏమిటంటే, ఈసారి ఎన్నికలలో నలుగురు తెరాస మంత్రులు పోటీ చేసి ఓడిపోయారు కనుక వారి స్థానంలో తెరాసలో సమర్ధులైన యువనాయకులకు మంత్రివర్గంలో అవకాశం కల్పించాలని సిఎం కేసీఆర్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ నెలాఖరులోగా కొత్త మంత్రివర్గం ఏర్పాటు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. మొదటి విడతలో ఆరు లేదా ఏడుగురు శాసనసభ్యులకు మంత్రివర్గంలో తీసుకొని, లోక్‌సభ ఎన్నికల తరువాత మిగిలినశాఖలను కూడా భర్తీ చేయాలని సిఎం కేసీఆర్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది.


Related Post