కోమటిరెడ్డి వెంకటరెడ్డి భవిష్యత్ కార్యాచరణపై ప్రకటన

December 15, 2018


img

నల్గొండ నుంచి శాసనసభకు పోటీ చేసి అనూహ్యంగా ఓడిపోయిన సీనియర్ కాంగ్రెస్‌ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పుడు ఏమి చేస్తారు? ఇదివరకు శపధం చేసినట్లు రాజకీయ సన్యాసం చేస్తారా లేక మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తరపున తెరాస ప్రభుత్వంతో పోరాటాలు కొనసాగిస్తారా? అని తెలుసుకోవాలని ప్రజలలో ఆసక్తి నెలకొంది. జిల్లాలో మునుగోడు నుంచి గెలిచిన ఆయన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  శనివారం మధ్యాహ్నం నార్కట్‌పల్లిలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఆయనతో పాటు నకిరేకల్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కూడా ఆ సమావేశంలో పాల్గొన్నారు. 

రాజగోపాల్ రెడ్డి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, “ఈసారి ఎన్నికలలో ప్రజాకూటమి గెలిచి అధికారంలోకి వచ్చినట్లయితే నల్గొండ జిల్లాకు ప్రభుత్వంలో బలమైన ప్రాతినిధ్యం లభిస్తుందని అనుకొన్నాము. తద్వారా జిల్లాను అన్ని విధాలా అభివృద్ధి చేసుకోవచ్చునని ఆశపడ్డాము. కానీ ప్రజాకూటమి ఓటమితో చాలా నిరాశ చెందాము. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎంత మెజార్టీతో గెలుస్తారనే మేము ఆలోచించాము తప్ప ఆయన ఓడిపోతారని కలలో కూడా ఊహించలేదు. ఆయన ఓటమిని జీర్ణించుకోవడం మాఅందరికీ చాలా కష్టంగానే ఉంది. అందుకే మా రెండు నియోజకవర్గాలలో మేము ఎటువంటి విజయోత్సవాలు నిర్వహించలేదు. ఏమైనప్పటికీ ప్రజాతీర్పును మేము అంగీకరిస్తున్నాము. మా ఓటమికి గల కారణాలను విశ్లేషించుకొని పంచాయతీ, లోక్ సభ ఎన్నికలలో మా సత్తా చాటడానికి గట్టిగా ప్రయత్నిస్తాము. ఈ ఎన్నికలలో మా పార్టీ ఓడిపోయినప్పటికీ మా నియోజకవర్గాల అభివృద్ధి చేసుకోవడానికి గట్టిగా కృషి చేస్తాము. యధాప్రకారం మా నియోజకవర్గంలో ప్రజల మద్యనే ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి గట్టిగా కృషి చేస్తుంటాము. కోమటిరెడ్డి వెంకటరెడ్డి లోక్ సభ ఎన్నికలలో పోటీ చేస్తారు,” అని చెప్పారు.


Related Post