సిఎం పదవి గురించి కేటిఆర్‌ ఏమ్మన్నారంటే...

December 15, 2018


img

తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటిఆర్‌ శనివారం మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో వివిద అంశాలపై విలేఖరులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు.

“కేసీఆర్‌ జాతీయ రాజకీయాలలోకి వెళ్ళబోతున్నారు కనుక ఆయన స్థానంలో మీరు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారా?” అని ఒక ప్రశ్నకు సమాధానంగా, “జాతీయ రాజకీయాలలో పాల్గొనడానికి డిల్లీలోనే కూర్చోనవసరం లేదు. హైదరాబాద్‌ నుంచి కూడా పాల్గొనవచ్చునని గతంలో స్వర్గీయ ఎన్టీఆర్ నిరూపించిచూపారు. కనుక కేసీఆర్‌ కూడా హైదరాబాద్‌ నుంచే జాతీయ రాజకీయాలలో పాల్గొంటారు. ఎందుకంటే, ఎవరు అవునన్నా కాదన్నా...తెలంగాణకు కేసీఆర్‌ అవసరం చాలా ఉంది. ఇదే వేగంతో రాష్ట్రాభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగలంటే ఆయనే మరో 10-15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండవలసిన అవసరం ఉంది. అయితే నన్ను తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడుగా చేశారు కనుక ఆ తరువాత ముఖ్యమంత్రిలో కూర్చోబెట్టబోతున్నారని ఊహాగానాలు చేయడం తప్పు. కేసీఆర్‌ జాతీయ రాజకీయాలలో చురుకుగా పాల్గొంటున్నంత మాత్రన్న ముఖ్యమంత్రి కుర్చీ ఖాళీగా ఉందని అనుకోనవసరం లేదు. ఆయన హైదరాబాద్‌ నుంచే అన్ని పనులు చక్కబెట్టగల సమర్ధులు,” అని కేటిఆర్‌ చెప్పారు. 

లోక్ సభ ఎన్నికల తరువాత కేటిఆర్‌ను ముఖ్యమంత్రిని చేయడం కోసమే ఇప్పుడు ఆయనకు ఏ మంత్రి పదవీ ఈయకుండా తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడుగా నియమించారని మీడియాలో వస్తున్న ఊహాగానాలకు కేటిఆర్‌ స్వయంగా చెక్ పెట్టారు. కానీ ఇది ఆయనను అభిమానించేవారికి కాస్త నిరాశ కలిగించే విషయమే.


Related Post