వేలక్కరలేదు...బ్యానర్ చాలు!

December 15, 2018


img

ఆంధ్రప్రదేశ్ శాసనసభ, లోక్ సభ ఎన్నికలలో జోక్యం చేసుకొని సిఎం చంద్రబాబునాయుడుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని సిఎం కేసీఆర్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే కేసీఆర్‌ జోక్యం చేసుకోకపోయినా వైయెస్సార్ కాంగ్రెస్ పార్టీ అప్పుడే ఆ పని మొదలుపెట్టేసింది. 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో తెరాస ఘనవిజయం సాధించగానే ఏపీలో కొన్ని ప్రాంతాలలో వైకాపా నేతలు టపాసులు కాల్చి మిఠాయిలు పంచి సంబరాలు చేసుకొని రెచ్చగొట్టడంతో ఊహించినట్లుగానే టిడిపి నేతలు వైకాపాపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదివరకు ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలున్న ఫ్లెక్సీ బ్యానర్లు ఏర్పాటుచేసి టిడిపిలో చిచ్చు రగిల్చిన వైకాపా నేతలు, ఇప్పుడు కేసీఆర్‌ ఫోటోలున్న ఫ్లెక్సీ బ్యానర్లు ఏర్పాటుచేసి టిడిపిలో ఆందోళన పుట్టిస్తున్నారు.

తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంగుటూరు మండలంలో కైకారం గ్రామంలో స్థానిక వైకాపా నేత ఒక ఫ్లెక్సీ బ్యానర్ ను ఏర్పాటుచేశారు. దానిలో ఒకవైపు కేసీఆర్‌, కేటిఆర్‌, కవిత ఫోటోలు మరోవైపు జగన్మోహన్ రెడ్డి, వెలమ సామాజిక వర్గానికి చెందిన స్థానిక నేతల ఫోటోలు ముద్రించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల విజయం సాధించినందుకు వెలమ సామాజిక వర్గం తరపున వైకాపా వెలమ యూత్ అసోసియేషన్ కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు ఆ బ్యానర్లో వ్రాశారు. 

ఈసారి కూడా ఊహించినట్లుగానే వెలమ సామాజిక వర్గానికి చెందిన స్థానిక టిడిపి కార్యకర్తలు ఆవేశంగా స్పందించారు. గురువారం రాత్రి ఉంగుటూరు జాతీయ రహదారిపై నిరసన తెలియజేస్తూ ధర్నా చేశారు. వారి ఫిర్యాదు మేరకు పంచాయతీ సిబ్బంది ఆ ఫ్లెక్సీ బ్యానరును తక్షణమే తొలగించారు. సదరు వైకాపా నాయకుడికి కేసీఆర్‌పై అభిమానం ఉంటే తన పేరుతో శుభాకాంక్షలు చెప్పుకోవాలి కానీ రాష్ట్రంలో వెలమ కులస్థులు అందరి తరపునా శుభాకాంక్షలు చెప్పడమేమిటని టిడిపి కార్యకర్తల వాదన.   

కెసిఆర్, కేటిఆర్‌ల ఫోటోలున్న ఫ్లెక్సీ బ్యానర్లే టిడిపిని ఇంత కలవరపాటుకు గురిచేస్తుంటే ఒకవేళ కేసీఆర్‌, కేటిఆర్‌, కవిత, హరీష్ రావు తదితరులు నిజంగానే ఏపీలో పర్యటించి రాజకీయాలు చేస్తే పరిస్థితి ఏవిధంగా ఉంటుందో తేలికగానే ఊహించవచ్చు. 

(ఫోటో: ఆంధ్రజ్యోతి సౌజన్యంతో) 


Related Post