కాంగ్రెస్‌లో కుమ్ములాటలు షురూ?

December 15, 2018


img

ఒక పార్టీ ఎన్నికలలో గెలిస్తే పదవుల కోసం పోటీ మొదలవుతుంది. ఓడిపోతే పరస్పరం నిందించుకొంటూ కుమ్ములాటలు మొదలవుతాయి. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో అదే జరుగుతోంది. కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి గజ్జెల కాంతం పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. 

ఇదివరకు గ్రేటర్ ఎన్నికలలో...మళ్ళీ ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలలో ఉత్తమ్ కుమార్ రెడ్డి తెరాసతో కుమ్మకయ్యి పార్టీని నిలువునా ముంచేశారని గజ్జెల కాంతం ఆరోపించారు. గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి హౌసింగ్ శాఖా మంత్రిగా ఉన్నప్పుడు చేసిన అవినీతి, అక్రమాలపై కేసీఆర్‌ విచారణకు ఆదేశించకుండా ఉండేందుకే ఆయన కేసీఆర్‌కు తొత్తుగా మారారని ఆరోపించారు. ఈఎన్నికలకు 6 నెలలు ముందుగా పార్టీ అభ్యర్ధులను ప్రకటిస్తానని చెప్పిన ఉత్తమ్ కుమార్ రెడ్డి కేసీఆర్‌తో రహస్య అవగాహన చేసుకొన్నందునే ఆఖరు నిమిషం వరకు అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేయకుండా, వారి పేర్లను ప్రకటించకుండా చాలా ఆలస్యం చేసారని తద్వారా తెరాస విజయానికి పరోక్షంగా సహకరించారని గజ్జెల కాంతం ఆరోపించారు. 

పొన్నాల లక్ష్మయ్య పిసిసి అధ్యక్షుడుగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ 21 సీట్లు గెలుచుకొంటే, ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో ఈసారి 19 సీట్లు మాత్రమే గెలుచుకొందని అన్నారు. తెలంగాణ ప్రజలు సోనియా, రాహుల్ గాంధీలను నమ్మారు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డిని కాదని అందుకే కాంగ్రెస్ పార్టీ ఓడించారని గజ్జెల కాంతం అన్నారు. “కాంగ్రెస్ పార్టీ గెలిచినా, ఓడినా నాదే బాధ్యత,” అని ప్రకటించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని గజ్జెల కాంతం డిమాండ్ చేశారు. 

కాంగ్రెస్ పార్టీలో టికెట్ లభించని అనేకమంది నేతలు కూడా బహుశః నేడో రేపో ఉత్తమ్ కుమార్ రెడ్డిపై ఇదే స్థాయిలో విమర్శలు గుప్పించే అవకాశం ఉంది. కనుక పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ఆయన పిసిసి అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తారా లేక కాంగ్రెస్‌ అధిష్టానం ఆయననే కొనసాగిస్తుందా చూడాలి. పిసిసి అధ్యక్షుడుపై ఇంత తీవ్రమైన ఆరోపణలు చేసినందుకు కాంగ్రెస్‌ క్రమశిక్షణసంఘం గజ్జెల కాంతంను సంజాయిషీ కోరుతూ షో-కాజ్ నోటీస్ పంపించింది.


Related Post