రాష్ట్రంలో బిజెపి ఓటమికి కారణాలు ఎన్నో..

December 13, 2018


img

తెలంగాణ ఏర్పడక మునుపు దేశంలో బిజెపికి మంచి బలమున్న ప్రాంతాలలో తెలంగాణ కూడా ఒకటి. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఆ పార్టీకి మంచి పట్టు ఉండేది. కానీ తెలంగాణ ఏర్పడిన తరువాత ఆ పార్టీ క్రమంగా నిర్వీర్యం అవుతూ తాజా ఎన్నికలలో తన ఉనికినే కోల్పోయింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ తో సహా ఆ పార్టీలో 118 మంది అభ్యర్ధులు ఓడిపోయారు. గోషామహల్ నుంచి ఒక్క రాజాసింగ్ మాత్రం గెలువగలిగారు.

గత ఎన్నికల తరువాత టిడిపితో దోస్తీ వలననే తాము నష్టపోతున్నామని వాదిస్తూ దానితో తెగతెంపులు చేసుకొంది. కానీ ఈసారి బిజెపిఒంటరిగానే పోటీ చేసినప్పటికీ ఇదివరకటి కంటే దారుణంగా ఓడిపోయింది. మరిప్పుడు ఎవరిని నిందిస్తారు? అంటే తమను తామే నిందించుకోవాలి. బిజెపి ఓటమికి ప్రధానకారణం తెరాస ప్రభంజనమేకావచ్చు కానీ ఇంకా అనేక బలమైన కారణాలు కనిపిస్తున్నాయి. 

1. ఈసారి ఎన్నికలను చంద్రబాబునాయుడిపై యుద్దంగా మార్చేయడం ద్వారా కేసీఆర్‌ ప్రజలలో మళ్ళీ తెలంగాణ సెంటిమెంటు రగల్చడంతో బిజెపి ఆ దుమారంలో కొట్టుకుపోయింది. 

2. సాధారణంగా ఏ రాజకీయ నాయకుడైనా తమ శత్రువుపై రాజకీయంగా దాడి చేయడం ద్వారా దెబ్బతీయడానికి ప్రయత్నిస్తాడు. రాష్ట్రం నుంచి టిడిపిని పారద్రోలడానికి కెసిఆర్ ఎటువంటి వ్యూహం అమలుచేశారో అందరికీ తెలుసు. కానీ బిజెపిని బలహీనపరచడానికి కేసీఆర్ ఎన్నడూ కనీవినీ ఎరుగని ఒక గొప్ప వ్యూహాన్ని అమలుచేశారు. బిజెపి అగ్రనేతలతో దోస్తీ కొనసాగించడం ద్వారా రాష్ట్రంలో బిజెపి విశ్వసనీయతను దెబ్బతీశారు. 

3. రాష్ట్రంలో అమలవుతున్న అనేక రాష్ట్రప్రభుత్వ పధకాలకు కేంద్రప్రభుత్వమే నిధులు అందజేస్తోందని, కేంద్రపధకాలకు అనుబందపధకాలే రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తోందని తెలంగాణ బిజెపి నేతలు ఏనాడూ ప్రజలకు గట్టిగా చెప్పుకొనే ప్రయత్నం చేయలేదు. కనుక అవన్నీ కేసీఆర్‌ స్వంత పధకాలుగానే భావించి ప్రజలు తెరాసకు పట్టం కట్టారు.

4. ప్రజలు ఏమి కోరుకొంటున్నారో దాని గురించి మాట్లాడకుండా, తెలంగాణ విమోచన దినోత్సవం, తెరాస-మజ్లీస్, దోస్తీ, జాతీయ రాజకీయాల గురించి మాట్లాడుతూ బిజెపి పట్ల రాష్ట్ర ప్రజలలో నిరాసక్తత కల్పించారు. 

5. కేసీఆర్‌, కేటిఆర్‌, కొందరు కాంగ్రెస్‌ నేతలు అచ్చమైన తెలంగాణ బాషలో ప్రజల మనసులకు హత్తుకొనేలా ప్రసంగాలు చేసి విజయం సాధిస్తే, బిజెపి నేతలు తమ శైలిలో ఎన్నికల ప్రచారం చేసుకొంటూ ముందుకు సాగిపోయారు తప్ప ప్రజాస్పందన ఏవిదంగా ఉందో పట్టించుకోలేదు.

6. రాష్ట్రంలో కేసీఆర్‌కున్న అపూర్వమైన ప్రజాధారణను కళ్ళారా చూస్తూ కూడా ఆయనను ఎదుర్కోవడానికి తగిన సన్నాహాలు, వ్యూహాలు, గెలుపు గుర్రాలను సిద్దం చేసుకోకుండా ఎన్నికల కురుక్షేత్రంలో దిగి మోడీ నామస్మరణతో గెలిచేస్తామని పగటికలలుకంటూ కాలక్షేపం చేయడం ఒక కారణం. 

కారణాలు ఏవైనప్పటికీ కేంద్రంలో బిజెపియే అధికారంలో ఉండగా రాష్ట్రంలో బిజెపి ఇంత దయనీయమైన స్థితిలో ఓడిపోవడం చాలా ఆశ్చర్యకరమే. రాష్ట్రంలో బిజెపి ప్రస్తుత పరిస్థితి చూస్తూంటే అది ఇక ఎప్పటికైనా కోలుకోగలదా? అనే అనుమానం కలుగుతోంది.  


Related Post