పార్లమెంటు సమావేశాలు ఎప్పటికీ ఇలాగే జరుగుతాయా?

December 13, 2018


img

పార్లమెంటు సమావేశాలంటే ఒకప్పుడు అర్ధవంతమైన లోతైన చర్చలు, దేశానికి సంబందించి కీలక నిర్ణయాలు తీసుకొనే ఒక గొప్ప వేదికగా ఉండేది. కానీ గత కొన్నేళ్ళుగా పార్లమెంటు సమావేశాలలో ప్రజా సమస్యలపై చర్చలకంటే, ఆ పేరుతో ఆందోళనలు నిర్వహిస్తూ రాజకీయవేదికగా మార్చేస్తున్నాయి. అయితే దీనికి కేవలం ప్రతిపక్షపార్టీలనే తప్పు పట్టలేము. అధికారపార్టీ సైతం తమకు పార్లమెంటులో ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవలసి వచ్చినప్పుడు మిత్రపక్షాల సభ్యుల చేత సభలో ఆందోళనలు చేయించడం ద్వారా సభలో ఎటువంటి చర్చా జరుగకుండా వాయిదాపడేలా చేస్తుండటం చాలా శోచనీయం. 

తాము ప్రజా సమస్యలపై పార్లమెంటులో  కేంద్రంతో చాలా తీవ్రంగా పోరాడుతున్నామని తమ రాష్ట్రాలలో ప్రజలకు చెప్పుకోవడానికి, తద్వారా రాష్ట్రంలో తమ రాజకీయ ప్రత్యర్ధులపై పై చెయ్యి సాధించడానికి సభలో కొన్ని పార్టీల సభ్యులు ఆందోళన చేస్తుంటే, వారు అందోళన చేస్తూ సభాకార్యక్రమాలను స్తంభింపజేస్తున్నారనే వంకతో పార్లమెంటులో ఎటువంటి చర్చలు జరుపకుండా సభను వాయిదా వేసి కేంద్ర ప్రభుత్వం తప్పించుకొంటోందని చెప్పక తప్పదు. పార్లమెంటు సమావేశాలు ముగిసిన తరువాత కేంద్ర ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలు తీసుకొని వాటిని ఆర్డినెన్స్ రూపంలో అమలుచేస్తోంది. అప్పుడు ప్రతిపక్షపార్టీలు మళ్ళీ దానిని గట్టిగా వ్యతిరేకిస్తూ విమర్శలు గుప్పిస్తుంటాయి. 

మూడు రోజుల క్రితం పార్లమెంటు శీతాకాల సమావేశాలు మొదలైనప్పటి నుంచి సభలో టిడిపి, డీఎంకె, అన్నాడీఎంకె, ఎంపీలు సభలో ఆందోళన చేపట్టి ఉభయసభలను స్థంభింపజేస్తున్నారు. తమిళ పార్టీలు తుఫాను నష్టపరిహారం కోసం సభలో నిరసనలు తెలియజేస్తుండగా, టిడిపి సభ్యులు ఎప్పటిలాగే ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలని కోరుతూ నిరసనలు తెలియజేశారు. ఆ కారణంగా ఉభయసభలు రేపటికి వాయిదా పడ్డాయి. కానీ రేపు కూడా ఉభయసభలలో మళ్ళీ ఇవే పరిస్థితులు నెలకొని ఉంటాయి కనుక రేపు కూడా మళ్ళీ వాయిదా పడటం తధ్యం. అంటే కోట్లాది రూపాయల ప్రజాధనం ఖర్చు చేసి పార్లమెంటు సమావేశాలు నిర్వహించడం వలన ప్రజలకు, దేశానికి ఓరిగిందేమీ లేదని స్పష్టం అవుతోంది. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నా తీరు చూసి సామాన్యప్రజలు సైతం పెదవి విరుస్తున్నారు. అయినా అధికార, ప్రతిపక్షపార్టీలు తీరు ఏమాత్రం మారకపోవడం దేశప్రజల దౌర్భాగ్యం. 


Related Post