లోక్ సభ ఎన్నికలలో బిజెపికి ఎదురీత తప్పదా?

December 12, 2018


img

2014 ఎన్నికలలో దేశవ్యాప్తంగా నరేంద్రమోడీ ప్రభంజనం వీయడంతో బిజెపి తిరుగులేని మెజార్టీతో కేంద్రంలో అధికారంలోకి రాగలిగింది. కానీ నోట్లరద్దు, జిఎస్టి వంటి అనేక కారణాల చేత కేవలం 5 ఏళ్లలోనే బిజెపికి ఎదురుగాలులు వీయడం మొదలయ్యాయని నిరూపించాయి నిన్న వెలువడిన 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు. 

బిజెపికి కంచుకోటలుగా చెప్పుకోబడుతున్న రాజస్థాన్, మధ్య ప్రదేశ్, ఛత్తీస్ ఘర్ రాష్ట్రాలలో కాంగ్రెస్‌ పార్టీ విజయబావుటా ఎగురవేసి బిజెపి అధిష్టానానికి పెద్ద షాక్ ఇచ్చింది. ఇక తెలంగాణలో బిజెపి 119 స్థానాలలో పోటీ చేసినప్పటికీ ఒకే ఒక సీటు గెలుచుకొని ఘోరపరాజయం పాలైంది. మిజోరాంలో ఊహించినట్లుగానే ప్రాంతీయ పార్టీ ఎంఎన్ఎఫ్ విజయం సాధించింది. 

మధ్యప్రదేశ్ (మొత్తం సీట్లు:230 ):  కాంగ్రెస్-114, బిజెపి-109, ఇతరులు-7.

ఛత్తీస్ గడ్ (మొత్తం సీట్లు:70 ):  కాంగ్రెస్-68, బిజెపి-15, ఇతరులు-7.

రాజస్థాన్ (మొత్తం సీట్లు:199 ): కాంగ్రెస్-100, బిజెపి-73, ఇతరులు-20.

మిజోరాం (మొత్తం సీట్లు:40): ఎంఎన్ఎఫ్-26, కాంగ్రెస్‌-5, బిజెపి-1, ఇతరులు-8.   

చాలా విచిత్రమైన విషయం ఏమిటంటే, నరేంద్రమోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రాష్ట్రాన్ని దేశంలో నెంబర్: 1 రాష్ట్రంగా అభివృద్ధి చేసిచూపినందుకు, గత లోక్ సభ ఎన్నికలలో దేశప్రజలు ఆయన మొహం చూసే బిజెపి, దాని మిత్రపక్షాలకు ఓట్లేసి గెలిపించారు. ఇప్పుడు తెలంగాణలో కూడా కేసీఆర్‌ అదేకారణంతో ఘనవిజయం సాధించారు. అంటే దేశాభివృద్ధి, రాష్ట్రాల అభివృద్ధి చేసినవారికే ప్రజలు గెలిపిస్తున్నారని స్పష్టం అవుతోంది. కానీ ఈ ఎన్నికలలో 5 రాష్ట్రాలలో బిజెపిని ప్రజలు తిరస్కరించారంటే అభివృద్ధి జరుగడం లేదని వారు భావిస్తున్నట్లు అనుకోవచ్చు. బిజెపి ఓటమికి ఇంకా అనేకానేక కారణాలు ఉండవచ్చు కానీ అభివృద్ధి మంత్రం జపించి అధికారంలోకి వచ్చినప్పుడు, ఓడిపోయినా అదే ప్రధాన కారణం అనుకోక తప్పదు.

కారణాలు ఏవైనప్పటికీ లోక్ సభ ఎన్నికలకు ముందు ఒకేసారి 5 రాష్ట్రాలలో ఓడిపోవడం బిజెపికి పెద్ద ఎదురుదెబ్బేనని చెప్పవచ్చు. ఈ ప్రభావం లోక్ సభ ఎన్నికలపై తప్పకుండా పడుతుంది కనుక ఆ ఎన్నికలలో గట్టెక్కడానికి బిజెపి ఇప్పటి నుంచే సన్నాహాలు మొదలుపెట్టక తప్పదు. 

అయితే బిజెపికి, ముఖ్యంగా ప్రధాని నరేంద్రమోడీకి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ సిఎం చంద్రబాబు నాయుడు ఒక ఫ్రంట్ ఏర్పాటు చేస్తుంటే, తెలంగాణ సిఎం కేసీఆర్‌ తాను కూడా కాంగ్రెస్‌, బిజెపిలకు వ్యతిరేకంగా మరో ఫ్రంట్ ఏర్పాటు చేస్తానని నిన్ననే ప్రకటించారు. ఈసారి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వేర్వేరుగా రెండు కూటములను ఏర్పాటు చేసి బిజెపికి, ప్రధాని నరేంద్ర మోడీకి పెద్ద సవాలు విసరబోతున్నారు కనుక లోక్ సభ ఎన్నికలలో బిజెపికి ఎదురీత తప్పకపోవచ్చు.


Related Post