తెరాసకు మద్దతు ఇస్తాం: బిజెపి

December 10, 2018


img

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై వెలువడిన ఎగ్జిట్ పోల్స్ లో 4-5 మీడియా సంస్థలు తెరాస గెలుపు ఖాయమని జోస్యం చెప్పగా, మరికొన్ని హంగ్ అవకాశాలు ఉన్నాయని జోస్యం చెప్పడంతో ఎన్నికల ఫలితాలపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. ఒకవేళ తెరాస, ప్రజాకూటమి రెంటికీ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన ‘మేజిక్ ఫిగర్ 60’  సీట్లు సాధించలేకపోతే అప్పుడు వాటికి ఏ పార్టీలు మద్దతు ఇస్తాయి? అనే ప్రశ్న తలెత్తుతుంది. దీనికి మజ్లీస్, బిజెపి, స్వతంత్ర అభ్యర్ధులు అనే సమాధానాలు సిద్దంగా ఉన్నాయి. 

“అటువంటి పరిస్థితే ఏర్పడితే, తెరాస మాకు మిత్రపక్షం కనుక మేము దానికే మద్దతు ఇస్తామని” ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ప్రకటించారు. ఎగ్జిట్ పోల్స్ హంగ్ జోస్యంపై రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కె.లక్ష్మణ్ కూడా స్పందించారు. హైదరాబాద్‌లో నిన్న మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, “ఒకవేళ రాష్ట్రంలో హంగ్ అసెంబ్లీ ఏర్పడినట్లయితే కాంగ్రెసేతర, ముస్లిమేతర పార్టీకి (తెరాస)కు షరతులతో కూడిన మద్దతు ఇస్తాము. మజ్లీస్ పార్టీని దూరంగా ఉంచితేనే దానికి (తెరాస) మద్దతు ఇస్తాము,”అని తెలిపారు. 

ఈ ‘హంగ్ సిగ్నల్స్’ ను చూసి రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ కూడా తెర వెనుక మజ్లీస్ మద్దతు కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది. తెరాసకు మద్దతు ఇవ్వడానికి బిజెపి సిద్దపడటం, మజ్లీస్ పార్టీని దూరంగా ఉంచాలనే దాని షరతు గురించి అసదుద్దీన్ ఓవైసీకి చెప్పి, కనుక తమకే మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్‌ కోరినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అసదుద్దీన్ ఓవైసీ స్పందించేందుకు నిరాకరించారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత మాట్లాడతానని చెప్పారు. 

ఒకవేళ తెరాస, ప్రజాకూటమిలలో ఏదో ఒకటి పూర్తి మెజార్టీ సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగితే ఏ సమస్యా ఉండదు. అలాకాని పక్షంలో తెరాస మొదటి ప్రాధాన్యత మజ్లీస్ పార్టీయేనని వేరే చెప్పనవసరం లేదు. అయినా మరికొందరి మద్దతు అవసరమనుకొంటే అది స్వతంత్ర అభ్యర్ధులకు ప్రాధాన్యం ఇస్తుంది తప్ప బిజెపి సాయం కోరకపోవచ్చు. ఎందుకంటే బిజెపి సాయం తీసుకొన్నట్లయితే మజ్లీస్ పార్టీ ప్రజాకూటమివైపు వెళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది. అప్పుడు బలాబలాలు తారుమారయ్యే ప్రమాదం ఏర్పడుతుంది కనుక. రేపు సాయంత్రం పూర్తి ఫలితాలు వెలువడేలోగానే ఈ రెంటిలో ఏది గెలుస్తుంది?హంగ్ ఏర్పడే అవకాశాలు ఉన్నాయా? అనే దానిపై చాలా వరకు స్పష్టత రావచ్చు. 


Related Post