బిఎల్ఎఫ్ ఓటమిని అంగీకరించిన తమ్మినేని

December 08, 2018


img

సిపిఎం రాష్ట్ర కార్యదర్శి, బిఎల్ఎఫ్ కన్వీనర్ తమ్మినేని వీరభద్రం తమ కూటమి ఓటమిని అంగీకరించారు. మీడియాతో మాట్లాడుతూ, “ఈ ఎన్నికలలో డబ్బు ప్రభావం చాలా తీవ్రస్థాయిలో ఉంది. దానిని అరికట్టడంలో ఎన్నికల సంఘం, పోలీసులు పూర్తిగా విఫలం అయ్యారు. ఈ ప్రలోభాలు లేకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగి ఉండి ఉంటే బిఎల్ఎఫ్ ప్రయత్నాలు ఫలించి ఉండేవి. కానీ 107 స్థానాలలో పోటీ చేయడం ద్వారా ప్రస్తుత రాజకీయ వ్యవస్థలో ప్రత్యామ్నాయాలు, సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధి వంటి అనేకానేక అంశాలపై సమాజంలో చర్చ జరిగేలా చేయగలిగాము. తాజా పరిస్థితిని బట్టి తెరాస మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ తెరాసకు పూర్తి మెజార్టీ రానట్లయితే మజ్లీస్, బిజెపిలు మద్దతు ఈయవచ్చు,” అని అన్నారు.

ఇదివరకు ఎన్నడూ లేనివిధంగా ఈసారి ఎన్నికలలో అధికార, ప్రతిపక్షపార్టీలు కోట్లాది రూపాయలు మంచినీళ్లలా ఖర్చు చేయడం అందరూ చూశారు. ఇక ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు అభ్యర్ధులు డబ్బును పల్లీలు పంచిపెట్టినట్లు పంచారు. కానీ ఎన్నికల సంఘం ఇదేమీ చూడనట్లు, తెలియవన్నట్లు నటిస్తూ ఎన్నికల ప్రక్రియ ముగించేసింది. తెలంగాణలో ఈసారి జరిగిన ఈ ఎన్నికలు కొన్ని పార్టీల మద్య జరిగిన ఎన్నికలుగా కాక కొందరు కోటీశ్వరుల మద్య జరిగిన ఎన్నికలుగా చెప్పుకోవచ్చు. బిఎల్ఎఫ్ వంటి శక్తివంతమైన పార్టీ సైతం ఈ ఎన్నికలలో వారితో పోటీపడలేక చేతులెత్తేస్తే ఇక సామాన్యులు ఎప్పటికీ ఓటింగ్ యంత్రాలుగానే మిగిలిపోకతప్పదని భావించవచ్చు. 



Related Post