నల్గొండ కంచుకోట ఎవరిది?

December 08, 2018


img

నల్గొండ అంటే కాంగ్రెస్‌ కంచుకోట అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో హేమాహేమీలైన నాయకులలో చాలా మంది ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందినవారే కావడం. కనుక ఈసారి నల్గొండలో గల 12 సీట్లలో 10 సీట్లు ఖచ్చితంగా గెలుచుకొంటామని కోమటిరెడ్డి సోదరులు గట్టిగా వాదిస్తున్నారు. అయితే ఈసారి ఆ కాంగ్రెస్‌ కంచుకోటను బద్దలుకొట్టి గులాబీ జెండా ఎగురవేయడానికి సిఎం కేసీఆర్‌ ఏడాదిన్నర క్రితం నుంచే యుద్దసన్నాహాలు ప్రారంభించిన సంగతి అందరికీ తెలుసు. 

సీనియర్ కాంగ్రెస్‌ నేత, నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డిని తెరాసలోకి ఆకర్షించి, తెలంగాణ రైతు సమన్వయ సమితికి ఆయనను ఛైర్మన్ చేయడం, దాని ద్వారా రైతుబంధు చెక్కుల పంపిణీ వంటివన్నీ ఆ యుద్ధప్రయత్నాలలో భాగమేనని చెప్పవచ్చు. అందుకే ఈసారి నల్గొండలో 12కు 12 సీట్లు మేమే గెలుచుకొని గులాబీ జెండా ఎగురవేస్తామని సిఎం కేసీఆర్‌ నమ్మకంగా చెప్పారు.

తెరాస ధీమాకు బలమైన కారణాలే కనిపిస్తున్నాయి. కోమటిరెడ్డి సోదరులు, జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులకు జిల్లాపై ఎంత పట్టుందో వారిపట్ల ప్రజలలో అంతే వ్యతిరేకత కూడా ఉందని చెప్పక తప్పదు. వారి వ్యక్తిగత, రాజకీయ వ్యవహార శైలి అందుకు ఒక కారణంకాగా, కాంగ్రెస్ పార్టీ అంటే అవినీతి, అసమర్ధతకు మారుపేరనే ప్రజలలో బలంగా ఉన్న దురాభిప్రాయం మరో కారణమని చెప్పవచ్చు. 

ఈ ఎన్నికలలో కాంగ్రెస్‌, తెరాసలలో ఇంచుమించు సమానబలమున్న నేతలు పోటీ పడుతున్నారు కనుక జిల్లాలో రెండు పార్టీలకు సరిసమానంగా సీట్లు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. అంటే కాంగ్రెస్‌ కంచుకోటను తెరాస బద్దలు చేసినట్లుగానే భావించవచ్చు. 


Related Post